రైతులను కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ రూరల్ మే 28: ప్రభుత్వం పంట కొనుగోలు చేయక పోవడంతో వర్షానికి పంట తడిసిందని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని పలు ప్రాంతాలలో వరి కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నదని, మంచిగా ఉన్న ధాన్యం కూడా కొనడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలని, రోహిణి కార్తె రావడంతో పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధం అవుతుంటే కనీసం పిండి సంచులు లేవన్నారు. రైతు బంధు లేదు.. రుణ మాఫీ లేదని. సకాలంలో కరెంటు ఇవ్వలేదన్నారు. ఆరుగాలం కష్టం చేసి పండిన పంట కూడా కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు.
పాలమూరు పనులు పూర్తి చేసేందుకు పిలిచినా టెండర్లు రద్దు చేశారని. ప్రాజెక్ట్ పూర్తి చేయమంటే మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నకిలీ పత్తి విత్తనాలను మార్కెట్ లో రాకుండా అధికారులు చూడాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు కొనుగోలు చేయడంతో పాటు పిండి సంచులు సకాలంలో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధు లను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇదే రకమైన పాలనా కొనసాగితే రైతుల పక్షాన పోరాటం చేస్తాం. గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మండల సీనియర్ నాయకులు మల్లు నర్సింహా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ ఉన్నారు






