ఉమామహేశ్వర ఆలయం ధర్మకర్తల మండలి నియామకం
రెండోసారి వారికే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు
జీవో 289 విడుదల చేసిన ప్రభుత్వం
అచ్చంపేట మే 28: శ్రీశైల ఉత్తరముఖ ద్వారంగా భాసిల్లుతోన్న.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న కమిటీ సభ్యులను తిరిగి అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్ జీవో నెంబర్ 289 విడుదల చేశారు. జీవో ప్రకారం గత చైర్మన్ బీరం మాధవరెడ్డితో సహా 14 మందికి కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించారు. ఆలయ అర్చకులు వీరయ్య శాస్త్రికి ఎక్స్ అఫీసియో సభ్యునిగా నియమించారు. కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రెండేళ్లు పాటు పదవిలో ఉండనున్నట్లు జీవోలో పేర్కొన్నారు.
ఈ మేరకు కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లు చేసేలా చూడాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవోకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే కొత్త పాలకవర్గం కొలువుదీరే అవకాశం ఉంది. తమను తిరిగి మరోసారి అవకాశం కల్పించడంపై ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.






