28 July, 2026 | 2:23 AM

సాగులో యాంత్రీకరణతోనే లాభాలు

28-07-2026 01:52 AM

ఖర్చు తగ్గించి.. దిగుబడి పెంపుపై దృష్టి సారించాలి

ఐకార్ క్రిడా డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్

కోటపల్లి, జూలై 27 : రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని హైదరాబాద్ ఐకార్ (ఐసీఏఆర్) క్రిడా డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ సూచించారు. కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామ రైతు వేదికలో పలు గ్రామాల రైతులకు సోమ వారం నిర్వహించిన కిసాన్ మేళా - రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై చెన్నూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) బానోతు ప్రసాద్ తో కలిసి మాట్లాడారు.

వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరం, ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా ఎల్ నినో పంటలపై చూపే ప్రభావాన్ని వివరించారు. నష్టాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వాతావరణ ఆధారిత పంటల ప్రణాళిక, నీటి యాజమాన్యం, సరైన విత్తనాల ఎంపిక, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై వివరించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.