28 July, 2026 | 2:23 AM

సందర్శించి.. పరిశీలించి.. పరీక్షించి..

28-07-2026 01:55 AM

గిరి విద్య, ఆరోగ్యంపై ఐటీడీఏ పీఓ ప్రత్యేక దృష్టి

ఉట్నూరు, జూలై 27 : గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందేలా ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరందు దృష్టి సారించారు.

ఇందులో భాగంగానే ఉట్నూరు మండల కేంద్రంలోని ఏందా గిరిజన ఆశ్రమ పాఠశాలను, అంగన్ వాడి కేంద్రాన్ని సోమవారం ఉదయం ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి, పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

విద్యార్థుల అభ్యాస స్థాయిని తెలుసుకునేందుకు ఆలోచనాత్మక ప్రశ్నలు అడిగి, వారి మేధో సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా చిన్నచిన్న పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వైద్య నివేదికలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్య వీక్ష యాప్ ద్వారా విద్యార్థుల వివరాలు, ఆరోగ్య సమాచారం, పాఠశాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్లోడ్ చేస్తున్నారా అనే విషయాన్ని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అర్హత కలిగిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆశ్రమ పాఠశాలలో చేరేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.

ప్రతి ఉపాధ్యాయుడు, అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, లక్ష్యసాధన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే ప్రతిరోజూ నాణ్యమైన ఆహారం అందించాలని, చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.

కేంద్రంలో పరిశుభ్రతను పరిశీలించిన ఆయన వంటగది, నిల్వ గదులు, భోజనశాల, చిన్నారుల విశ్రాంతి గదులను తనిఖీ చేశారు. వంట పాత్రలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం అనే నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే గిరిజన ప్రాంతాల పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికి అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.