05-02-2026 01:24:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : కౌలురైతులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎన్నికల ముందు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినా దాన్ని అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలను మూటగట్టుకుంటున్నది. రాష్ట్రం లో కౌలురైతులు 22 లక్షల మందికి పైగా ఉంటారని, దాదాపుగా 40 శాతం సాగుభూమి కౌలుదారుల ఆధీనంలో ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం వర కు కౌలురైతులే ఉన్నారు.
కౌలురైతులకు సర్కార్ నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతులపై కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తమవుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని రైతులకు రూ. 2 లక్షల రుణమాపీ, రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ. 15వేల చొప్పున రెండుసార్లు సాయం అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతోపాటు కౌలురైతులకు కూడా రూ. 15 వేలు చొప్పున ఇచ్చి ఆదుకుంటామనీ స్పష్టం చేసింది.
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద ఎకరాకు రెండు విడతల్లో రూ. 12 వేల చొప్పున విడుదల చేసింది. మొదటి, రెండో విడత కలిపి మొత్తం 69 లక్షలకు పైగా రైతులకు సుమారుగా రూ.12 వేల కోట్ల వరకు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిం ది. అయితే కౌలు రైతులకు కూడా రైతు భరో సా కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్న ఎన్నికల హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఈ లెక్కన కౌలురైతులు సుమారుగా రూ. 4,800 కోట్ల వరకు కోల్పోయారు.
కౌలు చట్టం తెస్తామన్న హామీ గాలికే..
2011లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కౌలుదారు చట్టాన్ని అమలుచేస్తామని, గ్రామసభల ద్వారా కౌలురైతులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కౌలురైతుకు రైతుభరోసా అందిస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కౌలురైతుల విషయంలో ప్రభుత్వం కనీసం చర్చించడం లేదనే విమర్శలున్నాయి. రైతు భరోసాపై కసరత్తులో వీరి ప్రస్తావనే రావడంలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కౌలురైతులకు రైతుబంధు ఇవ్వ డం సాధ్యం కాదని, అలా చేస్తే రైతులకు, కౌలురైతులకు కొట్లాటలు పెరిగిపోతాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కౌలురైతులకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది.
పెట్టుబడులూ అధికమే..
పంటలు పండించేందుకు కౌలురైతులు పెట్టే పెట్టుబడులు సైతం అధికంగానే ఉం టున్నాయి. ఎకరా విస్త్రీర్ణం సాగు చేసేందు కు ఖర్చులు రూ. 25వేల వరకు అవుతున్నాయి. ట్రాక్టర్ కిరాయి రూ.7వేలు వెచ్చిం చాల్సి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. అలాగే నాటు వేయడానికి రూ.4వేలు, ఎరువుల కోసం రూ.8వేలు, కలుపు తొలగించేందుకు రూ.3వేలు, పంట సమయం లో కోత మెషీన్‌కు గంటన్నరకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు.
ఈ లెక్కన ఎకరా సాగు చేసేందుకు రైతులు సగటున రూ. 25 వేలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుండటంతో కౌలు రైతు అధిక భారం మోయక తప్పడంలేదు. అలాగే ఎరువుల ధరలు స రాసరి రూ. 2వేల వరకు పెరిగినట్లు రైతులు వాపోతున్నారు.
అంతేకాకుండా కౌలురైతు గుర్తింపు కార్డులను ప్రభుత్వం రద్దు చేయడంతో బ్యాంకులు రుణాలు నిలిపివేశాయి. దీంతో పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కౌలు రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇప్పుడు వచ్చే బడ్జెట్‌లోనైనా కౌలురైతులకు ప్రభు త్వం ఏమైనా తీపికబురు చెబుతుందా? లేదా మరోసారి విస్మరిస్తుందా? అనేది రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.
పెరుగుతున్న కౌలు ధరలు..
భూముల కౌలు రేట్లు ప్రతియేటా పెరుగుతుండటంతో రైతులపై అధిక భారం పడుతున్నది. ప్రస్తుతం నీటి వసతులు ఉన్నచోట ఎకరా భూమికి సంవత్సరానికి రూ. 16 వేల పైచిలుకు రైతులు తీసుకుంటున్నారు. నీటి వసతులు తక్కువగా ఉన్నచోట రూ. 10వేల నుంచి 12వేల వరకు యజమానులు వసూలు చేస్తున్నారు. కొంతకాలంగా కౌలు రేట్లను పరిశీలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి.
2010లో ఎకరాకు రూ. 3 వేలు ఉన్న కౌలు భూముల ధరలు, 2011 లో రూ. 4 వేలు, 2012లో రూ.5వేలు, 2013లో రూ. 6వేలు, 2014లో రూ. 7 వేలు, 2015లో రూ. 8వేలు, 2016లో రూ. 9 వేలు, 2017లో రూ. 10వేలు, 2018లో రూ. 12వేలు ఉండగా, 2019లో రూ. 13వేలు, 2020లో రూ. 14వేలు, 2021లో రూ. 14 వేలు, 2022లో రూ. 15వేలు ఉండగా 2023 తర్వాత రూ.16వేలపై చిలుకు కౌలు రేట్లు పెరిగాయి. పంట దిగుబడితో సంబంధం లేకుండా అగ్రి మెంటు ప్రకారం భూముల యజమానులకు కౌలురైతులుపై రేట్లు చెల్లించాల్సి వస్తోంది.