మహిళలకు రూ. లక్ష కోట్ల రుణాలు ఇస్తాం: భట్టి విక్రమార్క
వ్యవసాయం వృత్తి కాదు.. అది మన సంస్కృతి.. జీవన విధానం
జగన్నాధపురం: ఖమ్మం జిల్లా(Khammam District) చింతకాని మండలం జగన్నాధపురంలో రైతుఆశీర్వాద సభలో(Rythu Ashirvada Sabha) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టిన వడ్డీ రుణాలను చెల్లించామని భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) వెల్లడించారు. మా ప్రభుత్వ హయాంలో మహిళలకు రూ. లక్ష కోట్ల రుణాలు ఇస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు రూ. 67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు.
మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు పరిమితిని.. రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని సూచించారు. మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు వ్యవస్థలోని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని వివరించారు. వ్యవసాయం వృత్తి కాదు.. అది మన సంస్కృతి.. జీవన విధానం అన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాలకు రూ. 5 వేలే ఇచ్చేందన్న భట్టి విక్రమార్క రైతు బంధు డబ్బులు జమ చేసేందుకు 160 రోజులు పట్టేదన్నారు. మా ప్రభుత్వం కేవలం 9 రోజుల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తోందని తెలిపారు. ఈ సభకు రైతు ఆశీర్వాద సభ అనే పేరు పెట్టింది రైతులేనని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని రైతులు ఈ పేరుపెట్టారని తెలిపారు. మహిళలను మహాలక్ష్ములుగా చూడాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం, రైతును రాజుగా చేయాలనేదే మా ఆకాంక్ష అని భట్టి విక్రమార్క సూచించారు. గత ప్రభుత్వం పంటలకు నష్ట పరిహారం ఇవ్వలేవని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నిర్మించిన నాగార్జునసాగర్ 60 ఏళ్లయినా చెక్కు చెదరలేదు, కాంగ్రెస్ నిర్మించిన శ్రీశైలం, జూరాల, పులిచింతల ప్రాజెక్టులు చెక్కు చెదరలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్ల పెట్టి.. కాళేశ్వరం కడితే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కొందరు పెద్దమనుషులు విమర్శించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటే కరెంట్, కరెంట్ ఉంటేనే కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.






