calender_icon.png 24 February, 2026 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు

24-02-2026 12:31:43 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, పేద వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం భారీ ఎత్తున సంక్షేమ ఫలాలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన 168 మంది లబ్ధిదారులకు రూ. 1.68 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో ఒకే దఫాలో పెద్దమొత్తంలో 307 మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు మంజూరుకావడం హర్షణీయమన్నారు. అనంతరం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ చికిత్స పొందిన 72 మంది బాధితులకు రూ. 30.75 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులను కూడా అందజేశారు.

ప్రజాపక్షం వహించే నాయకుడిగా, నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ సాయం అందే వరకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యతని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా పథకాలను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలితకుమారి, తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణప్రసాద్, నాగరాజు, కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.