25 April, 2026 | 10:42 PM

ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

25-04-2026 09:09 PM

* దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్న ఎమ్మెల్యే రోహిత్

* గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

పాపన్నపేట: ధాన్యం విక్రయాలలో అపోహలు నమ్మవద్దని రైతులు పండించిన పంట చివరిగింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన పాపన్నపేట, కొత్తపల్లి, కుర్తివాడ, నాగసాన్ పల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం విక్రయ కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా  చూడాలన్నారు.

ప్రతి రైతు ధైర్యంగా ఉండాలన్నారు. అనంతరం కొంపల్లిలో నిర్వహిస్తున్న గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక సర్పంచులు పావని నరేందర్ గౌడ్, శ్రీధర్, నాయకులు శ్రీనివాస్, రాజశేఖర్ తో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు, రైతులు ఉన్నారు.