13 April, 2026 | 4:52 AM

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం

13-04-2026 02:47 AM

విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాం తి): విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ప్రజాభవన్‌లో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు విద్యు త్ డిస్కములను ప్రైవేటుపరం చేస్తారని ప్రచారం జరుగుతున్నదని భట్టి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ, విద్యుత్ డిస్కములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించమని, ఈ విషయాన్ని నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని, అసత్య ప్రచారాలను ఖండించాలని సూచించారు. ఇంధన శాఖ దీర్ఘకాలం కొనసాగాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రజా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.

విద్యుత్  సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగుల జేఏసీ, అధికారులపై ఉందని ఆయన తెలిపారు. 1912కు వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేసి, మెరుగైన సేవలకు విద్యుత్ సంస్థలు చిరునామాగా నిలవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు ఇతర అంశాలు విని పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలకు ప్రతినెల గంట సమయం ఇచ్చేలా విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులను ఆదేశిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

మూడవ డిస్కం ఏర్పాటు, ఉద్యోగుల సర్దుబాటు, 2026 పీఆర్‌సీ, 2004 వరకు నియామకమైన వారికి పాత పెన్షన్స్ స్కీమ్ అమలు, రెగ్యులర్ ప్రమోషన్స్, రిక్రూట్మెంట్స్, ఆర్టిజన్ సమస్యలపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, సదానందం, స్వామి, రమేష్, అశోక్, సుధాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, దయానంద్, శివశంకర్, జనప్రియ, మల్లయ్య, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.