27 June, 2026 | 11:10 AM

రాంపూర్ లోయలో పడిన వ్యాన్: ఆరుగురు మృతి

27-06-2026 10:12 AM

రాంపూర్ : హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) రాంపూర్ సబ్‌డివిజన్ పరిధిలో ఒక హృదయ విదారక రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం, ప్రయాణికులతో వెళ్తున్న ఒక పికప్ వాహనం ధనోల్ సమీపంలో అదుపు తప్పి, దాదాపు 500 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. అందిన సమాచారం ప్రకారం, ఒక తల్లి ,ఆమె 10 ఏళ్ల కుమారుడితో సహా వాహనంలో ఉన్న ఆరుగురూ అక్కడికక్కడే మరణించారు. మృతులను ఆశా కుమారి (42), ఆమె కుమారుడు యుగల్ (10), డ్రైవర్ అశోక్ జైన్ (32), అభిషేక్ సైనీ (23), లాయక్ రామ్ (56), నితిన్ (23)గా గుర్తించారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు వాహనం లోపల నుండి ఒక లైవ్ వీడియో రికార్డ్ అవుతూ ఉండటం ఈ విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.