27 June, 2026 | 12:31 PM

తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు.. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

27-06-2026 11:09 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ సూచన ఉందని అధికారులు తెలిపారు. శనివారం నాడు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైంది. ఇవాళ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, సాయంత్రం 6 తర్వాత కాస్త పెరిగి, రాత్రికి వర్షం బీభత్సం సృష్టించనుందని అధికారులు తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం, విజయవాడ, గన్నవరం, గుడివాడ, ఏలూరు, అవనిగడ్డ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది.

వరుణుడా.. కరుణించు!!:  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో, MGNREGS కూలీలు వర్షం కోసం ప్రార్థిస్తూ తమ పనిముట్ల చుట్టూ బతుకమ్మ ఆడారు. 'ఎల్ నినో' ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని వ్యవసాయ పనులు స్తంభించిపోవడంతో, కూలీలు,  రైతులు మంచి వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.