27 June, 2026 | 11:57 AM

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: మంత్రి పొన్నం

27-06-2026 10:28 AM

త్వరలో ఆర్టీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. కొంతమంది కార్మిక సంఘాల నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో తాను, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఆర్టీసీ యాజమాన్యం, ప్రతి కార్మిక సంఘం నుంచి ఇద్దరు చొప్పున దాదాపు 30 మంది ప్రతినిధులతో సుమారు 14 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి అందరి ఆమోదంతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.

మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో, మూడు అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని నిర్ణయించామన్న పొన్నం ప్రభాకర్ యాజమాన్యం పరిధిలోని 29 అంశాల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మూడు కీలక అంశాలైన గుర్తింపు సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ఆర్టీసీ విలీనం విషయంలో కూడా ప్రభుత్వం తన హామీలను అమలు చేస్తోందని వివరించారు. 11 శాతం పీఆర్సీ జూలై నెల జీతాల నుంచే అమల్లోకి వస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల తొలి డిమాండ్ గుర్తింపు సంఘాల ఎన్నికలే, ఇప్పుడు అదే అంశంపై మాట మార్చి ప్రజలను, కార్మికులను పక్కదోవ పట్టించడం సరికాదని సూచించారు.

ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే కమిటీలో కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని సమావేశంలో అందరం ఏకగ్రీవంగా నిర్ణయించామని తెలిపారు. అయితే ఆ ప్రతినిధులు గుర్తింపు పొందిన కార్మిక సంఘం నుంచి ఉండాలంటే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగాల్సిందేనన్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని సూచించారు.

కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గుర్తింపు సంఘాల నేతలను విలీన కమిటీలో భాగస్వామ్యం చేసి విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది నాయకులు గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగకుండా, విలీన ప్రక్రియను వివాదాస్పదం చేసేలా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. మాట మీద నిలబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తుందన్న ఆయన కార్మికులు వాస్తవాలను గుర్తించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.