13 April, 2026 | 4:28 AM

అడుక్కుంటే ఇచ్చెటోళ్లం!

13-04-2026 02:28 AM
  1. క్యాతనపల్లిలో మంత్రి ఎమర్జెన్సీని తలపించిండు
  2. ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజాస్వామ్యమే గెలిచింది
  3. సీఎం బామ్మర్ది సింగరేణిని నడిపిస్తుండు
  4. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరుతో కోట్ల కుంభకోణం
  5. కాంగ్రెస్ ప్రభుత్వానిది దోచుకో.. దాచుకో పథకం
  6. మంచిర్యాలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మంచిర్యాల, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీ కావాలని మంత్రి వివేక్ అడుక్కుంటే నవ్వుకుంటూ ఇచ్చేటోళ్లమ ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ అధ్యక్షతన ఆదివారం నస్పూర్‌లో పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం, క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గానికి సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

క్యాతనపల్లి ఎన్నికల్లో మంత్రి నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని, కుట్రలు, కుతంత్రాలు పన్ని అక్రమంగా కేసులు పెట్టించి సబ్ జైలుకు కాకుండా ఆదిలాబాద్ జైలుకు పంపించి ఎలాంటి వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టారని మం డిపడ్డారు. 22 వార్డులు ఉన్న క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్, సీపీఐ కూటమి 14 స్థానాల్లో గెలిచినప్పటికీ, కాంగ్రెస్ కౌన్సిలర్‌ను చైర్మన్‌ను చేయ డానికి కోట్ల రూపాయలు ఇస్తానని, బ్లాంకు చెక్కులు ఇచ్చి ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినా బీఆర్‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు నిజాయితీగా నిలబడ్డారని అభినందించారు.

అక్రమ కేసులు పెట్టి బాల్కసుమన్‌ను ఆదిలాబాద్ జైలులో పెట్టించి, కౌన్సిలర్ భూమగౌడ్‌ను కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వకుంటే ఇల్లు కూలగొడతామని నానా ఇబ్బం దులు పెట్టారని, నీచమైన రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. వెయ్యి మంది పోలీసులను పెట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని, ఎమర్జె న్సీని తలపించారని, భయ బ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మున్సిపల్ ఎన్నిక సమయంలో మహిళా కౌన్సిల ర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మంత్రి వివేక్, ఎంపీ వంశీ చూసు కుంటూ కూర్చున్నారని, రాష్ట్రంలో అరాచక రాజకీయం నడిపిస్తున్నారని దుయ్యబట్టా రు. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకో.. దాచుకో.. పథకంలా పాలిస్తున్నదని ఆరోపించారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలంతా అదే పని మీద ఉన్నారని విమర్శించారు. 

సర్కారు విఫలం

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మింగడానికి మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా.. రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే నాయకులకు 2014 వరకు తెలంగాణలో వరి సాగు, దిగుబడి, 2021లో సాగు, దిగుబడిని పరిశీలిస్తే తెలుస్తుందని కేటీఆర్ హితవుపలికారు.

ధాన్యం దిగుబడి 24 లక్షల టన్నుల నుంచి కోటిన్నర లక్షల టన్నుల చేరిందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు, రైతుబీమా అమలుచేసిందని, రైతులకు అండగా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తే ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు డీపీఆర్ లేకుండనే, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం లేకుండానే బడ్జెట్‌లో కేవలం రూ.52 కోట్లు కేటాయించి, ప్రాజెక్టు కడతామని ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు.

సింగరేణిని నడుపుతున్నది సీఎం బామ్మర్దే

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి సింగరేణి సంస్థను నడిపిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరుతో కాంట్రాక్టులు కావాలంటే.. అడిగింది ఇవ్వాలని సీఎం బంధువులు బెదిరింపులకు  పాల్పడుతూ వేల కోట్ల కుంభకోణాలకు పాల్ప డుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో 16 వేల మందికి మెడికల్‌బోర్డు పెట్టి ఉద్యోగాలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీతో విచారణ జరిపిస్తామనడం శోచనీయమని మండిపడ్డారు. సృజ న్‌రెడ్డి మీద సిట్ వేసి ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు.

సింగరేణి కార్మికులు స్థానిక ఎమ్మెల్యేలను అడ్డుకొని, మెడికల్ బోర్డు నిర్వహించాలని నిలదీయాలని, సింగరేణి కార్మికులకు బీఆర్‌ఎస్, టీబీ జీకేఎస్ అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సమ స్యలపై యువకులు ప్లకార్డులు ప్రదర్శించగా.. గాడిదలకు గడ్డి వేసి.. ఆవులకు పా లు పిండితే వస్తాయా? వాళ్లను గెలిపించి సమస్యలను తమను తీర్చమంటే ఎలా అని కేటీఆర్ ప్రశ్నించారు.

సింగరేణిలో మెడికల్ బోర్డు, మారు పేర్లు, ఇండ్ల పట్టా లు తదితర సమస్యలపై త్వరలోనే తాము గళమెత్తుతామని, మీరూ రండి అని పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న సింగరేణి, సహకార, పరిషత్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌ను గెలిపించాలని కోరారు. క్యా తనపల్లి మున్సిపాలిటీలో చూపిన ప్రజాస్వామిక స్ఫూర్తిని 2028 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూపాలని సూచించారు.

అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విజ యం సాధించిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కోనూరు కోన ప్ప, టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మూల రాజిరె డ్డి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ సంద్యారాణి, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ మళ్లీ టీఆర్‌ఎస్‌గా..!

చంద్రుడు మళ్లీ ఉజ్వలంగా ప్రకాశిస్తాడు: కేటీఆర్

‘చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బులు తొలిగి చంద్రుడు మళ్లీ ఉజ్వలంగా ప్రకాశిస్తాడు.’ అని  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్సేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

తమకు పొత్తులతో కలిసిరాదని, కుదరదని వ్యాఖ్యానించారు. గతంలో తాము కొన్ని చిన్నచిన్న తప్పులు చేశామని తెలిపారు. అప్పుడు ప్రజలకు నా యకులకు మధ్య దూరం పెరిగిందని, గతం లో జరిగిన తప్పులపై అధ్యయనం చేశామని అన్నారు. లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.

‘డీలిమిటేషన్‌తో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 179కి, పార్లమెంట్ స్థానాలు 28కి పెరుగుతాయి. రాజకీ యాల్లో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. మేధావులు అనుకున్నవాళ్లు ఇప్పుడు మాట్లాడటం లేదు. నలుగురు సీఎంలు చరిత్రలో నిలిచిపోయేలా పాలించారు. వారే ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్’ అని కేటీఆర్ అన్నారు.