9 July, 2026 | 2:15 AM

గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

09-07-2026 01:26 AM
  1. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి
  2. సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క

మహబూబాబాద్, జూలై 8 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమిష్టి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం బుధవారం ఆర్.సి కన్వెన్షన్ హాలులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు.

మంత్రితో పాటు ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. జిల్లాలోని 482 సర్పంచులు, 405 పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల సమగ్ర అభివృద్ధి, పంచాయతీరాజ్ చట్టం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీసుకోవలసిన చర్యలు పై దివ్య దేవరాజన్, కలెక్టర్ స్నేహ శబరిష్, తదితరులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఐదు శాఖల ద్వారా కమిటీని వేసుకొని ముందుకు సాగుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు నిధులు తదితర అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా జులై 8,9,10 మూడు రోజులు మండల స్థాయి, డివిజనల్ స్థాయిలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పంచాయతీరాజ్ కమిషనర్, తాను స్వయంగా క్షేత్రస్థాయిలో తిరుగుతూ మహిళ సంఘాల ఆర్థిక అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సర్పంచుల ఐదు సంవత్సరాల కాలం పదవిలో ఉంటారని కచ్చితంగా శిక్షణ అవసరమన్నారు. గ్రామాల పటిష్ట అభివృద్ధికి కృషి చేస్తున్నామని గ్రామాల బాగుపడితే జిల్లా, రాష్ట్ర, దేశాలు బాగుపడుతుందని,

తద్వారా ప్రతి ఒక్కరూ బాగుంటారని తెలిపారు. కొత్తగా విబిజి రామ్ చట్టం రావడం ద్వారా రాష్ట్రంపై భారం పడుతుందని, కొత్త చట్టం పరిధిలో ఏ ఏ పనులు వస్తాయో తెలుసుకొని అవగాహన సర్పంచులకు ఉండాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలలో జమ అయినాయని, వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ఒక ప్రణాళిక ప్రకారం త్రాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, విద్యుత్,  స్కూల్ పనులు,

ఉపాధి హామీ పనులు పనులు, అంతర్గత అభివృద్ధి పనులు తదితర అంశాలపై డాష్ బోర్డు పై నమోదు చేసుకొని ఉండాలని, ప్రతిరోజు వారి పనులు కేటాయింపులు పూర్తి, పెండింగ్, వివరాలను వెంట వెంటనే తమకు నివేదికలు పంపాలని సూచించారు. కొత్త చట్టం ప్రకారం పని దినాలను తగ్గించడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం వాటా జమ చేయడం జరిగిందని, ఈ పథకం ద్వారా తీసుకున్న పనులను వేగవంతం చేయాలని బిల్లులో పెండింగ్ ఉన్నందున వేగంగా చేయాలన్నారు. వివో భవనాలు, అంగన్వాడి భవనాలు, గ్రామాలలోని నీటి కుంట, ఊట కుంట, ఇంటి కుంట, ప్రత్యేక వసతులు పనులను నిర్మించుకోవాలని సూచించారు,

గ్రామస్థాయిలో వసూలు చేసిన నిధులను స్టేట్ నిధులను స్వయంగా వారే వినియోగించుకునే విధంగా కొత్తగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, గతంలో సర్పంచులు లేక అనేక ఇబ్బందులు ఉండేవని ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు ఏర్పడి నందున, వేగంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి విధులు నిర్వహించాలని సూచించారు. ఉద్యోగులకు బదిలీలు ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, అందుకోసం ప్రతి ఒక్కరు అంకితభావంతో సర్పంచులు, గ్రామ కార్యదర్శిలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధి ఎంపికలో గ్రామస్థాయిలో 10 అంశాలలో అభివృద్ధిని చూస్తారని,

ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపికైన గ్రామాలకు అధిక నిధులు వస్తాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించి సస్పెండులకు గురికా వద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ఉన్నత పదవులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారని గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నాయని అట్టి నిధులను వినియోగించుకొని ముందుకు సాగాలని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో  పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పీడీ పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జిల్లా పంచాయతీ అధికారి హరి ప్రసాద్, అన్ని విభాగాల అధికారులు. తదితరులు పాల్గొన్నారు.