9 July, 2026 | 2:11 AM

విస్తరిస్తున్న మీ సేవలు

09-07-2026 01:22 AM

కొత్తగా యూరియా బుకింగ్ ఏజెన్సీ రైతులకు ఉపయోగకరం 

ములుగు(మహబూబాబాద్) జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి చేస్తున్న కృషిలో భాగంగా ‘మీసేవ’లను మరింత విస్తృత పరుస్తోంది. వివిధ రకాల ధ్రువపత్రాలతో పాటు తాజాగా రైతులు యూరియా బుక్ చేయడానికి మీ సేవలో కొత్త ప్రొవైడర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా పరిధిలో మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సదుపాయాన్ని రైతులకు బుధవారం నుండి అందుబాటులోకి తెచ్చారు.

రైతులకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో పొందడానికి, మీసేవ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పలువురు రైతులు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకుంటున్నారని, అయితే యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం తెలియని రైతులు తమ సమీప మీసేవ కేంద్రాన్ని సందర్శించి సులభంగా యూరియా బస్తాలను బుక్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

యూరియా బుకింగ్ కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతితో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను మీసేవ కేంద్రంలో సమర్పించి, వివరాలను నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు యూరియా బస్తాలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, బుకింగ్ పూర్తయ్యాక యూరియా బుకింగ్ ఐడీతో కూడిన రసీదును రైతులకు అందజేస్తారని అధికారులు పేర్కొన్నారు. పోడు పట్టాలు కలిగిన రైతులు కూడా ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఈ సేవల అమలుపై జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ సేవకు రూ.10 సేవా రుసుము నిర్ణయించినందున రైతులు నిర్ణీత రుసుము చెల్లించి ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు. మొబైల్ నంబర్ మార్పు చేసుకోవాలనుకునే రైతులు, కౌలు రైతులు యూరియా బుకింగ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత రైతు వేదికలోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ను సంప్రదించి మొబైల్ నంబర్ మార్పు, కౌలు రైతుగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు.

అసలు పట్టాదారు అనుమతితో కౌలు రైతులు కూడా యూరియా బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపారు. డిజిటల్ సంతకం పూర్తికాని భూములు కలిగిన పట్టాదారు రైతులు కూడా తమ ఆధార్ నంబర్ ఆధారంగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

ఏజెన్సీ రైతులకు ఎంతో మేలు

ఏజెన్సీ ప్రాంతా రైతులకు మీసేవ ద్వారా యూరియా పొందడానికి ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. స్మార్ట్ఫోన్ లేని రైతులకు అందుబాటులో ఉన్న మీసేవ కేంద్రానికి వచ్చి సులభతరంగా యూరియా బుక్ చేసుకునే విధంగా మీ సేవలో ఏర్పాటు చేసాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే రైతులు తమకు అవసరమైన యూరియాను పొందవచ్చు.

- దేవేందర్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ , ములుగు