విభజించాలి.. పంచుకోవాలి
ఈఎస్‌ఐలో తకరారు!
డిస్పెన్సరీల్లో మందులు, వైద్య పరికరాలు, వస్తువుల పంపకంపై తలలు బాదుకుంటున్న ఉద్యోగులు చాలా డిస్పెన్సరీల్లో సిబ్బంది కొరత
ఇతర ప్రదేశాలకు తరలించాలంటే..
ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు ఎలా?
26 డిస్పెన్సరీలను విభజించేందుకు నానా తంటాలు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అధికారులు గుడ్డిగా ఆదేశాలు జారీ చేసి.. చేతులు దులిపేసుకుంటున్నా రు. ఆ ఆదేశాలను అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు నానాతంటాలు పడుతున్నారు. దశాబ్దాలుగా కలిసిఉంటూ లబ్ధిదారులకు సేవలు అందిస్తున్న ఈఎస్‌ఐలోని డిస్పెన్సరీలను విభజించి..
ఏ ప్రాం తంలో అయితే ఉండాలో ఆ ప్రాంతంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ తాజాగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీని తో క్షేత్రస్థాయిలో ఆయా డిస్పెన్సరీలను ఎలా విభజించాలి.. ఇప్పటివరకు డిస్పెన్సరీల పరిధిలో ఉన్న మందులు, పరికరాలు, సామగ్రిని ఎలా పంచుకోవాల నేదానిపై తకరారు మొదలయ్యింది.
23 డిస్పెన్సరీల విభజనకు ఆదేశం..
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు.. ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 26 డిస్పెన్సరీలను (ఇవి 13 డిస్పెన్సరీలుగా కొనసాగుతున్నాయి) విభజించి ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ భవనాల్లో ఏర్పా టు చేయాలని ఈనెల ఒకటిన డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దాదాపు మూణ్నాలుగు దశాబ్దాలుగా ఒక్కో ప్రాం తంలో రెండేసి డిస్పెన్సరీలు కలిసికట్టుగా పనిచేస్తూ.. ఈఎస్‌ఐ లబ్ధిదారులకు సేవ లు అందిస్తున్నాయి.
మొత్తం 13 ప్రాంతా ల్లో రెండు చొప్పున పనిచేస్తున్న మొత్తం 26 డిస్పెన్సరీల (కవాడిగూడ- కవాడిగూడ రోడ్డు, కవాడిగూడ న్యూ- విద్యాన గర్, అమీర్‌పేట-ఖైరతాబాద్, బోరబండ -బాలానగర్, బాలానగర్ ఓల్డ్-సనత్‌నగర్ 3, చిలకల్‌గూడ-మౌలాలి, డబీర్ పురా-యాకుత్‌పురా, గోషామహల్-నాంపల్లి, కార్వాన్, రామంతాపూర్- ఓల్డ్‌సిటీ, సికింద్రాబాద్-రెజిమెంటల్‌బజార్, సనత్‌నగర్ 1 -సనత్‌నగర్ 2, జీడిమెట్ల 1-జీడిమెట్ల 2, సారపాక-రామవరం)ను వేటికవిగా విడదీసి, విభజిం చి, ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పైగా ఏ రెండు డిస్పె న్సరీల మధ్యన 5 కి.మీ కంటే తక్కువ దూరం ఉండవద్దనికూడా సూచించారు. అకస్మాత్తుగా వీటిని విభజించి ఏర్పాటుచేయాలంటూ ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఉరుకులు పరుగులపై విభజన చేసే ప్రయత్నానికి దిగారు.
మందులు, సామగ్రి ఎలా పంచేది?
అయితే అధికారులు ఆదేశాలు జారీచేసి చేతులు దులుపుకోగా.. క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు ఇది విషమపరీక్షగా మారింది. 60:40 నిష్పత్తిలో డిస్పెన్సరీలను పంచుకోవాలని మార్గదర్శకాలు జారీ కావడం తో అందుకు కసరత్తు చేస్తున్నారు. పెద్ద డిస్పెన్సరీకి 60 శాతం, చిన్న డిస్పెన్సరీకి 40 శాతం అన్ని రకాల మం దులు, పరికరాలు, సామాగ్రిని పంచుకోవాలని చెప్పడం తో అలాగే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉన్న మందులను 60:40 నిష్పత్తిలో పంచడం గగనంగా మా రింది.
అలాగే కుర్చీలు, ఫ్యాన్లు, బల్ల లు, ఫ్రిడ్జ్‌లు, ర్యాక్‌లు, ల్యాబ్ ఐటంలు, కంప్యూటర్లు.. ఇలా చీపుర్లతోసహా అన్నీ అదే నిష్పత్తిలో పంచడానికి ప్రయత్నిస్తున్నా బెడిసికొడుతున్నాయి. ఉదాహరణకు.. ఇప్పటివరకు కొన్ని చోట్ల రెండు ఫ్రిడ్జ్‌ను రెండు డిస్పెన్సరీలు ఉపయోగించేవి. పెద్ద డిస్పె న్సరీ ల్లో నాలుగు వరకు ఉండేవి. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్‌లను ఎలా పంచాలో తెలియ డం లేదు. ఒకేవేళ ఒక డిస్పెన్సరీకి రెండు ఫ్రిడ్జ్‌లు వచ్చి.. మరో డిస్పెన్సరీకి ఒకే ప్రిడ్జ్ వస్తే.. అవసరాలు ఎలా తీరుతాయి అనేది తేలడం లేదు.
ల్యాబ్ ఐటంలు.. కూడా ఒకే డిస్పెన్సరీకి సరిపోయేలా ఉంటాయి. ఇప్పుడు వాటిని ఎలా పంచాలి. ఒకవేళ పంచి తే.. ఒక డిస్పెన్సరీకి మైక్రోస్కోప్ వస్తే.. మరొకరికి మైక్రోస్కోప్ ఉండదు. ఒకరికి సెల్ కౌంట్ చేసే యంత్రం వస్తే.. మరొకరికి ఉండదు. ఇలా కొరత ఉండే సామాగ్రితో వేర్వేరుగా ఎలా సేవలు అందించాలనేది తేలక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఆఖరికి చీపుర్లుకూడా పంచుకోవాలంటే ఏదో ఒక సమస్య తలెత్తు తోందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.
ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఎలా..
పోనీ కిందామీదా పడి డిస్పెన్సరీలను విభజించి.. ప్రభుత్వ భవనాలను ఊసినా.. అక్కడికి తరలించాలంటే ఎలా.. ఖర్చులు ఎవరు భరిస్తారనే సమస్య ఉద్యోగులను వేధిస్తోంది. ఒక్కో డిస్పెన్సరీకి కనీసం రెండు, మూడు లారీల సామాను ఉంటుంది. పెద్ద డిస్పెన్సరీ అయితే నాల్గు లారీల సమాను అవుతుంది. ఇవన్నీ తరలించడానికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలంటే.. అధికారుల నుంచి మౌనమే సమాధానమవుతోంది. అంటే ఉద్యోగులే చందాలు వేసుకుని డిస్పెన్సరీని తరలించాలా అంటూ ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు.
ఇక అధికారుల ఆదేశాల ప్రకారం 60:40 నిష్పత్తిలో అన్ని విభజన చేసినా.. చాలా చోట్ల సరైన సిబ్బంది లేరు. మరి ఎవరికి ఛార్జ్ అప్పజెప్పాలి అనేది మరో సమస్య. ఉదాహరణకు.. ఫార్మాసిస్ట్ లేని డిస్పెన్సరీలు ఉన్నాయి. మందులను విభజించిన తరువాత.. ఎవరికి ఆ మందు లు అప్పజెప్పాలనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్నిచోట్ల ఇంఛార్జీలు లేరు.
పంపకాల తరువాత ఓవరాల్‌గా ఎవరికి అప్పజెప్పాలనేది తేలడంలేదు. ఇంతా చేసినా.. కొత్తగా ఏర్పాటుచేసే డిస్పెన్సరీలో అటు సిబ్బంది కొరతతోపాటు మందులు, పరికరాల కొరత తలెత్తుతుంది. వాటిని ఎలా సమకూర్చుకుంటారనేదానిపైకూడా స్పష్టత లేదు. దీనితో డిస్పెన్సరీల విభజన సమస్య తమ నెత్తిన చుట్టుకుందని ఉద్యోగులు వాపోతున్నారు.






