ఇక వేచి చూడలేం!
- క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు సమాధానం చెప్పలేకపోతున్నాం
- కార్యాచరణను ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ
- 17న లంచ్ టైంలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు
- మే 5న అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్రస్థాయిలో సామూహిక నిరసనలు
- మే 14న సమావేశమై తదుపరి కార్యాచరణ
- 51% ఫిట్‌మెంట్‌తో జూన్ 2లోపు పీఆర్సీ ప్రకటించాలి
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): పెండింగ్ సమస్యల పరిష్కారా నికి రాష్ట్ర ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఉద్యమ కార్యాచరణను ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు. ఈనెల 17న భోజన విరామ సమయంలో మండలకేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు, అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.
మే 5న అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్రస్థాయి లో సామూహిక నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. మే 14న జేఏసీ సమావేశాన్ని ఏర్పాటుచేసి తదుపరి కార్యాచర ణను ప్రకటిస్తామన్నారు. జూన్ 2లోపు పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు, డీఏలు, హెల్త్ కార్డులు జారీ, సీపీఎస్‌ను రద్దుతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్ ముసారాంబాగ్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు.
అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తమ వి గొంగెమ్మ కోర్కెలు కావని, న్యాయమైన డిమాండ్లని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గడువు కావాలంటే ప్రభుత్వానికి ఇప్పటికే 30 నెలలవరకు సమయమిచ్చామని, ఇక వేచి చూసేది లేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తమ మాట వినడంలేదని, తమపై దాడిచేసే పరిస్థితి ఉందని, అందుకే ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు.
తాము దాచుకున్న డబ్బులు, తమకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఎం దుకివ్వరని వారు ప్రశ్నించారు. పీఆర్సీ కమి టీ ఏర్పాటుచేసి దాదాపుగా 30 నెలలు పూర్తి అయ్యిందని, కమిటీ గడువును పొడిగించకుండా రిపోర్టును తెప్పించుకుని ఉద్యో గులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో జూన్ 2లో పు పీఆర్సీ ప్రకటన చేయాలని వారు కోరారు.
అధికారులు వినడంలేదు..
సీఎంకు, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఎన్నోసార్లు తమ సమస్యలను విన్నవించినా అవి పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆవేద వ్యక్తం చేశారు. మంత్రులు చెబుతు న్నా అధికారులు వినడంలేదని వారు విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టదా అన్నారు. పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్ల చొప్పున కాకుండా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.13 వేల కోట్లు ఒకేసారి లేదా రెండు విడతల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల హెల్త్ కార్డులు విడుదల చేస్తామని స్వయంగా సీఎం చెప్పారని, కానీ అది అమలు కాలేదన్నారు. క్యాబినేట్ సబ్‌కమిటీ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, దీన్ని వెంటనే అమలు చేయాలని సీఎస్‌కు పలుమార్లు విజ్ఞప్తిచేసినా అమలు కావడంలేదన్నారు. అసలు అధికారులు తమ గోడు వినేందుకు సమయమే ఇవ్వడంలేదని పేర్కొన్నారు.
ఈహెచ్‌ఎస్ స్కీం విధివిధానాలను వెంటనే అమలు చేసి మే 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను అమలుచేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని త్వరతగతిన ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ఉపాధ్యాయ సంఘాలతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆకునూరి మురళిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగాంతోపాటు మరికొన్ని జిల్లాల కలెక్టర్ల తీరు సరిగాలేదని, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం విచారణ చేయించాలన్నారు. లేకుంటే వారిపై తమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఒక రోజు అఖిలపక్షం ద్వారా ఐదు గ్రామ పంచాయతీల సాధన సదస్సును ఈనెల 13న నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, మేధావులకు దీనిపై వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జేఏసీ నాయకులు పీ.దామోదర్ రెడ్డి, చావా రవి, బీ శ్యామ్, ఎస్‌ఎం హుస్సేని ముజీబ్, వంగా రవీందర్ రెడ్డి, జి.సదానందం గౌడ్, మధుసూదన్ రెడ్డి, కటకం రమేష్, అంజిరెడ్డి, ఎం చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ కే వెంకటేశ్వర్లు, మహ్మద్ అబ్దుల్లా, ఎం రాధా కృష్ణ, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.




