పినరయి గాడ్‌ఫాదర్ మోదీ!
- కేరళం సీఎం రోల్ మోడల్ జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీ కాదు
- మోదీ, అమిత్‌షానే ఆయనకు రోల్ మోడల్
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీనే గాడ్‌ఫాదర్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక విషయాల్లో మోదీని సంప్రదించే విజయన్ నిర్ణయాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. వారిద్దరి మధ్య చీకటి ఒప్పందాలున్నాయని, దీనిలో భాగంగానే విజయన్‌పై ఉన్న కేసుల గురించి కేంద్రం నోరుమెదపడం లేదని చెప్పు కొచ్చారు.
రేవంత్‌రెడ్డి మంగళవారం కేరళంలోని పలుచోట్ల యూడీఎఫ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంతో చర్చకు దిగే ఉద్దేశం తనకు లేదంటూ విజయన్ విడుదల చేసిన లేఖపై రేవంత్ స్పందించారు. విజయన్‌కు రోల్‌మోడల్స్ దిగ్గజ వామపక్ష నేతలు జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీ కాదని, మోదీ, అమిత్‌షానే ఆయనకు రోల్‌మోడల్స్ అని ఎద్దేవా చేశారు.
కేరళం ప్రభుత్వ పనితీరుపై తాను గౌర వంగా, హుందాగా స్పందించాలని అనుకున్నానని, కానీ.. విజయన్ తెలంగాణ ప్రభుత్వంపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం కలచివేసిందని చెప్పుకొచ్చారు. ‘నా ప్రత్యర్థులపై ఆవేశపూ రితంగా, తొందరపాటు వ్యాఖ్యలు చేయను. విజయన్ తెలంగాణ వచ్చినప్పుడు, ఒక అతిథికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలిస్తాను’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితులగురించి అవాస్తవాలు ప్రచారం చేశారని, ఆయన చూపిన గణాంకాలు నీతి ఆయోగ్ ఎస్డీజీ 2023-24 నాటివని, అప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. తమ ప్రజా ప్రభుత్వం 28 నెలలు పూర్తి చేసుకున్నందున, ఈ మధ్య కాలంలో తమ పనితీరును విజయన్ అంచనా వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
పేదరికాన్ని నిర్మూలించారా..?
2025, చివరి నాటికి తీవ్ర పేదరికాన్ని (ఎక్సట్రీమ్ పావర్టీ) పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళం నిలవనుందని మీరు ట్వీట్ చేశారని కేరళం సీఎం విజయన్‌కు రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇది 2026, ఏప్రిల్ నెల, కానీ మీరు రాసిన లేఖలో 64,006 కుటుంబాలు ఇప్పటికీ పథకాలను పొందుతున్నాయని పేర్కొన్నందున.. మీరు పేదరికాన్ని నిర్మూలించారా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2025, నవంబర్ 1వ తేదీ నాటి మీ ప్రకటన ఎందుకు ఆచరణలోకి రాలేదని విజయన్ ను సీఎం ప్రశ్నించారు.
నీతి ఆయోగ్ అవినీతి ర్యాంకింగ్‌లను తాను గౌరవిస్తానని సీఎం తెలిపారు. విజయన్ ప్రకటించుకున్నట్లు కేరళం ప్రభు త్వం స్వచ్ఛమైనదైతే బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో విచారణ అధికారులు, సీఎం కా ర్యాలయంలో ఎలా కీలక ఆధారాలు గుర్తించారని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయిందని, శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ రైజింగ్ దార్శనికతతో ముందుకు..
తెలంగాణలో తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్- 2047 దార్శనికతతో ముందుకు వెళ్లుతోందని సీఎం తెలిపారు. హైదరాబాద్ సమీపంలో ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్‌లో జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మించి, రాష్ట్రాన్ని దశాబ్దంలోనే ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.




