సింగూర్ నీటిపై హెచ్‌ఆర్సీ కీలక ఆదేశాలు
- రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం ఫలితం
హెచ్‌ఆర్సీ కమిషనర్‌కు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ కృతజ్ఞతలు
మెదక్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): సింగూర్ నీటి సమస్యపై తెలంగాణ హ్యూ మన్ రైట్స్ కమిషన్ (హెచ్‌ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. మెదక్ జిల్లా పాపన్న పేట మండల పరిధిలోనీ ఘనపూర్ ఆయకట్ట పరిధిలోని రైతులకు సాగునీరు అందించేందుకు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 0.30 టీఎంసీ నీటిని 12 రోజుల పాటు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసింది.
ఈ విషయంపై మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం హెచ్‌ఆర్సీని ఆశ్రయించి రైతుల నీటి సమస్యను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను వివరించడంతో స్పందించిన హెచ్‌ఆర్సీ వెంటనే చర్యలు చేపట్టింది.
ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్, ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉండగా నీటి కొరతతో ఎండిపోతున్న పరిస్థితిని గమనించింది. సుమారు 20 వేల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉండగా, నీరు అందకపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. రైతులు విత్తనాలు, ఎరువులు, కూలీలపై భారీగా ఖర్చు పెట్టారని, ఈ దశలో నీరు అందకపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది.
ఇప్పటికే మూడు విడతల్లో 0.90 టీఎంసీ నీరు విడుదల కాగా, చివరి విడతగా 0.30 టీఎంసీ మాత్రమే మిగిలి ఉందని, రిజర్వాయర్‌లో ప్రస్తుతం 7.39 టీఎంసీ నీరు అందుబాటులో ఉండటంతో వెంటనే విడుదల చేయాలని సూచించింది. రైతుల పంటలను కాపాడేందుకు తక్షణ చర్యగా నీటి విడుదల ప్రారంభించాలని ఆదేశించిన హెచ్‌ఆర్సీ, ఈ అంశంపై తీసుకున్న చర్యలపై ఈ నెల 30లోపు నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.




