కాంగ్రెస్ సర్కార్‌ది పిరికిపంద చర్య
బీఆర్‌ఎస్ నేతల అరెస్టుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతల అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారుది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. భూసేకరణ ఆపాలని, నేతలను విడుదల చేయాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవ డానికి పోరాడుతున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న బీఆర్‌ఎస్ నేతలను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం, అరెస్టులు చేయడాన్ని ఖండించారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సహా పలువురు నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్‌ఎస్ నాయకులకు కొత్తేమీ కాదని, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇలాంటి ఎన్నో ఆంక్షలను తాము ఎదుర్కొన్నామని, ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతామని స్పష్టంచేశారు.
రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం తన బలహీనతను బయటపెట్టుకుంటోందని విమర్శించారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు.
పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఈ ప్రక్రియను బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, బాధితులకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు.




