రేవంత్‌తో చర్చించే ఉద్దేశం లేదు!
- ఆ పని తెలంగాణ ప్రజలు చూసుకుంటారు..
- చర్చకు ఇంకా ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి..
- కేరళం ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
- తెలంగాణ సీఎం రేవంత్ విసిరిన సవాల్‌కు స్పందన
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదు’ అని కేరళం సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళం ప్రభుత్వ పనితీరుపై చర్చకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మంగళవారం ఈమేరకు విజయన్ లేఖ విడుదల చేశారు. రేవంత్‌రెడ్డితో చర్చకు దిగేందుకు తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆ రాష్ట్ర ప్రజలే తీర్పునిస్తారని వ్యాఖ్యానించారు.
రాజకీయ విబేధాలను పరిష్కరించుకునేందుకు రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధిలో దేశంలోనే కేరళం అగ్రస్థానంలో ఉందని, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎస్‌డీజీ ఇండెక్స్ 2023- -24లో 79 పాయింట్లతో తమ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు.
ఆ నివేదికలో తెలంగాణ 6వ స్థానంలో ఉందని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళం అని స్పష్టం చేశారు. అవినీతిలో తెలంగాణ మాత్రం దేశంలోనే 6వ స్థానంలో ఉందని తెలిపారు.
ఐటీ, పారిశ్రామిక వృద్ధి..
కేరళం ప్రభుత్వం తాజా ఐటీ పాలసీ ద్వారా భారత ఐటీ ఎగుమతుల్లో 10 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుందని విజయన్ తెలిపారు. విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం ద్వారా కేరళ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తమ రాష్ట్రం ఇప్పుడు అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పారిశ్రామిక స్తబ్దత ఉందన్న రేవంత్ వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపారేశారు. బీజేపీతో తాను మెతకగా ఉంటున్నానన్న రేవంత్ ఆరోపణలపై విజయన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్రం అనుసరిస్తున్న సమాఖ్య వ్యతిరేక విధానాలపై సుప్రీంకోర్టులో రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నది కేరళం ప్రభుత్వమేనని గుర్తుచేశారు. మైనార్టీల హక్కుల కోసం, రాజ్యాంగ విలువల కోసం తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కేంద్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తమ రాష్ట్రానికి కనీసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయినా కేటాయించలేదని మండిపడ్డారు. అదొక్కటే కాదని, ఇంకా అనేక ప్రాజెక్టులపైనా మొండిచేయే చూపిందని సీఎం విజయన్ ధ్వజమెత్తారు.




