6 August, 2026 | 2:32 AM

పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

06-08-2026 01:07 AM

జనరల్ ఆస్పత్రిలో తనిఖీ 

నిర్మల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును సమీక్షించారు.

ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఇతర సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సిటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ఎక్స్రే ఫిలింల కొరత ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సిటీ స్కాన్ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఎక్స్రే ఫిలింల కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 25 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం పూర్తయిందని, ప్రారంభోత్సవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దీంతో జిల్లా ప్రజ లకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కావునట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజు నరేష్, ఈశ్వర్, అర్జున్, విఠల్, సూరజ్, సాత్విక్, BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, జాప ప్రసాద్, కందుల హరీష్, అచ్యుత్ రావు, తో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.