బెంగళూరుకు తరలిన బీసీల దండు
- ప్రత్యేక బస్సులను ప్రారంభించిన జాజుల
- మా వాటా మాకు దక్కేవరకు ఉద్యమిస్తాం
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
ముషీరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బీసీల వాటా బీసీలకు దక్కే వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీలను ఏకం చేసి దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ నెల 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాదులోని గన్‌పార్క్ నుంచి వందలాది మంది బుధవారం బయలుదేరారు.
బెంగళూరుకు వెళుతున్న ప్రత్యేక బస్సులకు జాజుల శ్రీనివాస్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. దేశంలో మండలకమిషన్ సిఫారసులను అమలు చేయాలని దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం లేదన్నారు. మండల్ సిఫారసులను అమలు చేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించిన ఆగస్టు 7న ప్రతి సంవత్సరం దేశంలోని 29 రాష్ట్రాల బీసీలను ఏకం చేస్తూ జాతీయ ఓబీసీ మహాసభలను దేశంలోని అన్ని రాష్ట్రాలలో నిర్వహిస్తూ వస్తున్నామని అందులో భాగంగానే ఈ నెల ఏడో తేదీన బెంగళూరులోని సిటీ యూనివర్సిటీలో ఉన్న జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో జాతీయ ఓబీసీ11వ మహాసభను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మహాసభకు తెలంగాణ నుండి 1000 మంది, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, కేరళం, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు తరలి వెళుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి సగర, బీసీ జేఏసీ కోచైర్మన్ పిట్ల శ్రీధర్, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరస్వామి, బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, బీసీ నేతలు పాల్గొన్నారు.






