6 August, 2026 | 2:30 AM

పెండింగ్ పనులు పూర్తి చేయాలి

06-08-2026 01:03 AM

జిల్లా అదనపు కలెక్టర్ రాములు

కోటపల్లి/చెన్నూర్/హాజీపూర్, ఆగస్టు 5: జిల్లాలో రెవెన్యూ, పౌర సరఫరాలకు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు కోరారు. బుధవారం జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలో డిప్యూటీ తహసిల్దార్ తో కలిసి తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటపల్లి శివారులోని సర్వే నంబర్ 389 లో 1.12 ఎకరాల భూమిని గుర్తించామని, కార్యాలయ నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

చెన్నూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ తో కలిసి చెన్నూర్ లోని ఎంఎల్‌ఎస్ పాయింట్ గోదాంను సందర్శించి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం తరలింపును ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని గోదాం నిర్వాహకులను ఆదేశించారు. రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పురోగతిని సమీక్షించారు. నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, తదితరులున్నారు.