రాష్ర్టపునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
- ప్రజల నమ్మకాన్ని ‘కూటమి’ నిలబెట్టుకుంటుంది
- డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
- కూటమి ప్రభుత్వం రెండేళ్లు అయిన సందర్భంగా..
- తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ
- పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్
అమరావతి, జూన్ 12: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమి ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిక్షణం కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రెండు సంవత్సరాల క్రితం ప్రజలు మాకు కేవలం అధికారాన్ని మాత్రమే ఇవ్వలేదు.. రాష్ట్ర భవిష్యత్ అనే ఒక పెద్ద బాధ్యతను మా భుజాలపై పెట్టారని పేర్కొన్నారు. ఈ కూటమి ఏర్పడింది సీట్లను, అధికారాన్ని పంచుకోవడానికి కాదు.. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ బాధ్యతను పంచుకోవడానికి అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూట మి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ పేరిట భారీబహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ ప్రజలు కేవలం ఓటే కాదు..
చరిత్ర రాస్తారని, 2024 లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం కలిగించిదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు, వారి తీర్పును మించిన శక్తి మరొకటి లేదన్నా రు. అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యంపై సాధించిన విజయం ఇది అని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజ లు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కేవలం ఒక ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సరికొత్త దిశను నిర్దేశించిందన్నారు.
ఈ సందర్భంగా తమకు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు, కూటమి కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అన్ని స్థానాల్లో విజయం సాధించడం తమపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఎన్డీయే ప్రభుత్వ సమష్టి కృషితో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోగలిగామని వెల్లడించారు. అలాగే దేశంలోనే అత్యధికకాలం ప్రధానిగా ఉన్న మోదీకి అభినందనలు తెలిపారు. ఇటీవల విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో ౯ మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. దీంతో ఈనెల 9న జరగాల్సిన ఈ విజయోత్సవ సభను వాయిదా వేసి, ఇప్పుడు నిర్వహిస్తున్నామన్నారు.






