13 June, 2026 | 2:32 AM

రేవంత్ చేతిలో కాంగ్రెస్ మసి

13-06-2026 01:14 AM
  1. మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలం 
  2. వర్షాలకు ప్రజల అవస్థల పాపం ముఖ్యమంత్రిదే 
  3. బ్లాక్‌మెయిలింగ్ సంస్థగా హైడ్రా 
  4. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ కుట్రలే కారణం
  5. వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే బీఆర్‌ఎస్‌కు పోటీ 
  6. ఒంటరిగానే పోటీ.. ఎవరితోనూ పొత్తులుండవు
  7. కచ్చితంగా మాదే విజయం.. మూడో స్థానంలోనే కాంగ్రెస్ 
  8. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ శిథిలమై అంతమవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీతోనే పోటీ ఉం టుందని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు.

శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ హయాంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్డీపీ) చేపట్టి మెరుగు చేస్తే.. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేశా రు. రేవంత్‌రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యా రు. మేము వేసిన ఫ్లైఓవర్లు, ఎస్‌ఎన్డీపీ నిర్వహణ కూడా చేయడం లేదు. ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు.

హైదరాబాద్ నగరంలోని వర్షాలకు ప్రజల అవస్థ పాపం ముమ్మాటికీ రేవంత్‌రెడ్డిదే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లనే ఆ ప్రాంతంలో రద్దీ భారీగా పెరిగిందని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి ఉంటే ఎయిర్‌పోర్ట్ 18 నెలల్లో మెట్రో పూర్తి అయ్యేదని కేటీఆర్ అన్నారు. భూసేకరణ లేకుండా సులభంగా పూర్తయ్యే మెట్రోను రేవంత్ రెడ్డి ఆపేశారని పేర్కొన్నారు. హైడ్రా అనేది ఒక బ్లాక్‌మెయిలింగ్ సంస్థగా మార్చారు.

హైడ్రాను అన్ని సమస్యలకు జిందా తిలస్మాత్ లెక్క చూపిస్తున్నారు. కానీ హైడ్రా బ్లాక్మెయిలింగ్, డబ్బుల వసూళ్లకు తప్పించి ఇంకేమీ పని చేయడం లేదు’ అని ఆరోపించారు. మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అంటారని, రేవంత్ రెడ్డి హిట్లర్ గురించి మాత్రమే మాట్లాడలేదని, ‘హిట్లర్ అంతకముఠా నాకు ఆదర్శం‘ అన్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చెప్పిన యుద్ధ శిథిలాల కిందనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతిపెడతారని విమర్శించారు. 

మీనాక్షి ఓటమికి కాంగ్రెస్ కుట్రలే కారణం

మీనాక్షి నటరాజన్ ఓటమికి ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ కుట్రలే కారణమని, కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి ద్రోహం చేసిన వాళ్లెవరో తెలుసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. ఆమెపై ఉన్న కేసు వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారో విచారణ జరుపుకోవాలని, పదే పదే సిట్ అనే ముఖ్యమంత్రి, ఈ అంశం పైన కూడా సిట్ వేసుకోవచ్చని సూచించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘బ్లాక్ షీప్’ (పార్టీ ద్రోహులు) ఎవరో కనుక్కోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి కూడా డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్న వ్యక్తే అని అని ఎద్దేవా చేశారు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం భారీగా అమ్ముతున్న భూముల నుంచి వచ్చే నిధులు ఎక్కడ పోతున్నాయో చెప్పాలని, రూ. 4 లక్షల కోట్ల అప్పు తీసుకువచ్చి వాటిని ఎక్కడకు పంపిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పక్కన పెట్టిందని, కొత్తగా పెన్షన్లు, హామీలు అమలు చేయడం లేదు.. కానీ కొత్త హెలికాప్టర్లు కొని సీఎం సోకులు పడుతున్నారని విమర్శించారు.

సీఎం రూ.200 కోట్లతో రాజసౌధాలు కట్టుకుంటున్నారని, సీఎం రాజప్రసాదానికి సంబంధించిన నిర్మాణ జీవోలు అన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం సైతం హైదరాబాద్, ఖమ్మం, మధిరలో భారీ ఇండ్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. 

డీలిమిటేషన్‌లో వాటా తగ్గితే ఊరుకోం

వచ్చే నెలలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందనే సమాచారం తమకుందని కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు. ‘డీలిమిటేషన్‌లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకోం‘ అని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో పార్లమెంట్ స్థానాలు పెంచాలన్న అంశం పైన ఇప్పటిదాకా సమాచారం లేదన్నారు. నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి చేసింది ఏమీ లేదని, 12 సంవత్సరాల కాలంలో ఒక్క హామీని కూడా నిలుపుకోలేదన్నారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషం నింపడం, మత రాజకీయాలు తప్ప మోదీ చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 12 ఏళ్ల బీజేపీ పాలనలో దక్కింది శూన్యమని మండిపడ్డారు. 

బీజేపీ, కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీ నిర్మాణం

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, సభ్యత్వ నమోదు మొబైల్ అప్లికేషన్ సిద్ధంగా ఉందన్నారు. అప్లికేషన్ టెస్టింగ్ కొనసాగుతున్నదని, ఆ తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సభ్యత్వ నమోదు పైన శిక్షణ ఉంటుందన్నారు. నియోజకవర్గాల వారీగా ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని, ఇప్పటికే జనరల్ సెక్రటరీలు, ఇంఛార్జీలు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారని, 60 నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్, మెంబర్షిప్ పైన సమావేశాలు పూర్తి అయ్యాయని తెలిపారు.

సభ్యత్వ నమోదు ఈ నెలాఖరు వరకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నదని, ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుని తర్వాత కమిటీలకు, కార్యకర్తలకు శిక్షణ నిర్వహిస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీ నిర్మాణం తమకున్నదని, గ్రామగ్రామాన బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉన్నదని వెల్లడించారు. భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, అది ఎప్పుడనేది త్వరలో తెలుస్తుందన్నారు. 

జలాల కోసం నిలబడింది బీఆర్‌ఎస్సే

గతంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కేసీఆర్ వ్యక్తిగతంగా సమావేశమై తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రయత్నం చేశారని, కానీ ఆయన మహారాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం రూపంలో ససేమిరా అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకోరనే విషయం తెలిసిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికే రేవంత్‌రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ కోసం నిలబడింది కేసీఆర్ మాత్రమే అని, ఆయన సభ పెట్టిన తర్వాతనే కేఆర్‌ఎంబీకి రాసిన లేఖను ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. నీళ్ల విషయంలో బీజేపీ రాసిన స్క్రిప్ట్‌నే కాంగ్రెస్ చదువుతుందని, నీళ్ల నష్టాన్ని తాజాగా ఎండగట్టింది కూడా మా ప్రభుత్వమే, మా పార్టీనే అని స్పష్టం చేశారు.

సింగరేణి అంశంలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడుతుందని, స్వయంగా సీఎం బావమరిది సింగరేణి వ్యవహారాలు నడిపిస్తున్నారని, సైట్ విజిటేషన్ మొదలుకొని నైనీ గనుల వరకు అనేక అక్రమాలు జరిగాయని తెలిపారు. బొగ్గు తవ్వకుండా తవ్వినట్లు చూపించి అడ్డగోలుగా వందల కోట్ల కుంభకోణానికి తెరలేపారని, ఇప్పుడు కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల కోసం మాట్లాడే ముందు అందులో కేంద్రానికి వాటా ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకురావాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో కిషన్ రెడ్డి కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామని గత ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల వలన దాని అమలు ఆలస్యమైందని గుర్తు చేశారు. 100 రోజుల్లో వారి సమస్యలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికి అడుగడుగున ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.