ఎల్‌నినో డేంజర్ బెల్స్!
- పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై పరిస్థితులు
- ఈ సీజన్‌లోలో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం
- భారత వాతావరణ శాఖ హెచ్చరికలు
న్యూఢిల్లీ, జూన్ 12: ఎల్‌నినో డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లు పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రజలకు శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లోలో ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని.. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనుందని హెచ్చరించింది.
దేశంలో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అత్యధిక వర్షపా తం నమోదయ్యే నైరుతి రుతుపవనాల్లో ఈసారి వర్షపాతం తగ్గుతుందని అంచనా వేసింది. భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలా లు సాధారణం కన్నా ఎక్కువగా వేడెక్కడాన్ని ఎల్‌నినోగా అభివర్ణిస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం తారుమారవుతుందని వెల్లడించింది. చివరిగా ఎల్‌నినో ప్రభావం 2023లో ఏర్పడింది.
ఆ సమయంలో దేశవ్యాప్తంగా రుతుపవనాల అంతరాయం, వర్షపాతంలో వైవిధ్యం వంటి పరిస్థితు లు తలెత్తాయి. ఎల్నినో ప్రభావానికి అత్యంత ఎక్కువగా గుర య్యే అవకాశం ఉన్న 197 జిల్లాలను కేంద్ర ప్ర భుత్వం గుర్తించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
పంట నష్టభయాలను తగ్గించడానికి రాష్ట్రాల వారీగా అత్యవసర ప్రణాళికలను రూపొందించామన్నారు. ఎల్‌నినో వల్ల ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ‘ఖేత్ బచావో అభియాన్’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
మరో పక్క రాబోయే రెండు మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లోకి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఈ సీజన్‌లో ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా రుతుపవనాల విస్తరణ ఉంటుందని పేర్కొంది.






