13 June, 2026 | 1:56 AM

‘సమ్మక్క-సారక్క’కు ఎన్‌ఓసీ!

13-06-2026 01:02 AM
  1. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి సానుకూలత
  2. త్వరలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీకి అంగీకారం
  3. హైదరాబాద్‌లో విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ
  4. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చ

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : ములుగు జిల్లాలోని తుపాకుల గూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క-సారక్క (తుపాకుల గూడెం) ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అడుగు ముందుకు పడింది. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇవ్వడానికి ఛత్తీస్‌గఢ్ సర్కార్ సానుకూలత వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి తో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదల ఇంజినీరిం గ్ అధికారులతో కలిసి భేటీ అయ్యారు. 

ఈ భేటీలో సమ్మక్క,సారక్క బ్యారేజీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జలసంఘం తుది పరిశీలనకు సమర్పించాలని, ఎన్‌ఓసీ జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్ సీఎంను మంత్రి ఉత్తమ్ కోరారు. గోదావరి జలాల వినియోగం, పెండిం గ్ సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు సాగునీటి భద్రత వంటి అంశాలకు తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులకు సమ్మక్క, సారక్క బరాజ్ అత్యంత కీలకమైనదని వివరించారు.

తన విజ్ఞప్తికి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ పరిణామం సమ్మ క్క, సారక్క ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక మ లుపుగా నిలుస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్‌ల నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయని వెల్లడించారు. ఎన్‌ఓసీ లేకపోవ డం వల్ల డీపీఆర్ తుది పరిశీలన నిలిచిపోయిందని, ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. మరింత ఖచ్చితమైన సర్వేకోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని గుర్తు చేశారు. సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లు 2026 ఏప్రిల్‌లోనే ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు ఉత్తమ్ వెల్లడించారు.

ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములను గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ సీఎంకు తెలియజేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.

ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్-2 ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యం

గోదావరిపై కంఠనపల్లి వద్ద బరాజ్ నిర్మించి ఎస్సార్‌ఎస్పీ స్టేజ్-2 ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా సమ్మక్క, సారక్క ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టును పునఃరూపకల్పన చేశారని పేర్కొన్నారు. సాంకేతిక అధ్యయనాల అనంతరం ములుగు జిల్లాలోని తూపాకులగూడెం వద్ద నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ మార్పు తో ఛత్తీస్‌గఢ్‌లో ముంపు ప్రభావం గణనీయంగా తగ్గిందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సార్‌ఎస్పీ స్టేజ్ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 2,34, 199, మహబూబాబాద్ 96,494, ఖమ్మం 85,774, వరంగల్ 22,422, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుందన్నారు.

అలాగే రామప్ప లింక్ కాలువ ద్వారా ములుగు జిల్లాలో 8,000, వరంగల్ నర్సంపేట ప్రాంతంలో 22,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇదే కాకుండా జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపో తల పథకంలోని కొంత ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీరు అందనుందని చెప్పారు, ప్రాజెక్టు డీపీఆ ర్‌ను 2021 ఆగస్టు 31న కేంద్ర జల సంఘానికి సమర్పించినట్లు మంత్రి తెలిపారు.

హైడ్రాలజీ డైరెక్టరేట్, కాస్ట్ ఎస్టిమేట్స్ డైరెక్టరేట్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జలమండలి సహా పలు ప్రధాన అనుమతులు ఇప్పటికే లభించాయని చెప్పారు. ఎన్‌ఓసీ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా  కృషి చేస్తుందన్నారు. ఈ విషయమై ఇప్పటికే నాలుగు సార్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి లేఖలు రాశామని,  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంను స్వయంగా కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర జల సంఘం చైర్మన్‌తోనూ చర్చలు జరిపామని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రత్యేంగా విన్నవించామని వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడం వల్ల ఎన్‌ఓసీ ఇవ్వడానికి అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి తెలిపారు. ఎన్‌ఓసీ జారీ చేసిన వెంటనే కేంద్ర జల సంఘం అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ డీపీఆర్ తుది పరిశీలన పూర్తి చేస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.