13 June, 2026 | 1:54 AM

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం..

13-06-2026 12:40 AM
  1. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్ 
  2. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని హస్తినాపురం, చంపాపేట డివిజన్లలో అక్రమ నిర్మాణాలు సీజ్ 

ఎల్బీనగర్, జూన్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. భవన నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపడుతున్న అక్రమ కట్టడాలపై శుక్రవారం ఎల్బీనగర్ సర్కిల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిర్మాణ పనులను నిలిపివేశారు.

ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏసీపీ అంబికా శ్రీ, టీపీఎస్ సాయి అర్చన, చైన్ మన్లు కృష్ణ, రాజ్ కుమార్, సెక్షన్ రైటర్ రవీందర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ పాండు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.  టీజీబీపాస్ చట్టం-2020, జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 461(ఏ) ప్రకారం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న చంపాపేట డివిజన్ లో మూడు భవనాలను గుర్తించి సీజ్ చేసి సీలింగ్ నోటీసులు అంటించారు.

దుర్గానగర్, నిర్మల్ నగర్ కాలనీ, శ్రీ సత్యసాయి ఎన్ క్లేవ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి,  జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన ప్లాన్ కు  విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణాలు, అనుమతి లేని  పనులు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా భవన నిర్మాణ పనులను నిలిపివేస్తూ సీజింగ్ నోటీసులు జారీ చేశారు. 

హస్తినాపురం డివిజన్‌లో...

 హస్తినాపురం డివిజన్ లోని టీచర్స్ కాలనీలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. టీచర్స్ కాలనీ, బీడీ రెడ్డి గార్డెన్, రోడ్ సమీపంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన షెడ్డును ఎంఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజింగ్ చర్యలు చేపట్టారు. పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో పాటు అవసరమైన అనుమతులు లేకుండానే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత ప్రాంగణాన్ని సీజ్ చేశారు.

నోటీసులు ఇచ్చినా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.. 

ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని స్థానికులు, ఇతరులు ఇచ్చిన ఫిర్యాదులపై జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి, ముందస్తుగా హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. అయితే, నిర్మాణదారులు నోటీసులను లెక్క చేయకుండా అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు.  దీంతో అధికారులు నిబంధనల ప్రకారం భవనాలను సీజ్ చేసి తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టారు.

అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కూడా వెనుకాడబోమని ఏసీపీ అంబికా శ్రీ, టీపీఎస్ సాయి అర్చన స్పష్టం చేశారు. భవన యజమానులు అనుమతులు పొందిన ప్రణాళిక మేరకే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.