13 June, 2026 | 4:11 AM

హోర్ముజ్‌లో భారతీయులపై ఆగని దాడులు

13-06-2026 12:38 AM
  1. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు 
  2. 48 గంటల్లో రెండోసారి జారీ 

న్యూఢిల్లీ, జూన్ 12: హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు కొనసాగుతుం డటంతో అమెరికా తీరు పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గత 48 గంటల్లో రెండోసారి ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్‌కు భారత్ సమన్లు జారీ చేసింది. బుధవారం జరిగిన ఘటనలో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్న ఓ వాణిజ్య నౌక దాడికి గురికావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

అమెరికా దౌత్యాధికారికి భారత విదేశాంగ శాఖ తమ ఆందోళనలను నేరుగా తెలియజేసింది. కాగా గత దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒమన్ తీర ప్రాంతంలో నాలుగు రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని భారత ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్‌లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకాయానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని భారత్ కోరింది. భారత నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

సెట్టెబెల్‌లో నౌకపై దాడి జరిగిన వెంటనే అమెరికా అధికారులకు గట్టి నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. అంతకు ముందు ఓ నౌకపై దాడికి సంబంధించిన ఘటనలో ముగ్గురు భారతీయులు గల్లతైనందుకూ భారత్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాడుల ఘటనల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్(డీజీఎస్) పలు సూచనలు చేసింది. హోర్మూజ్, ఒమన్ తీరాల్లో పనిచేస్తున్న సుమారు 18వేల మంది నావికులకు సముద్ర భద్రతా సంబంధిత అడ్వైజరీని జారీచేసింది.