13 June, 2026 | 3:21 AM

పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం

13-06-2026 02:01 AM

నకిరేకల్లో రూ.45.25 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

అందజేసిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, జూన్ 12: అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో ఆయన నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 138 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.45,25,150 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలు స్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వ్యవసాయ రంగంపై మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తుందని, రామన్నపేట మండలంలో కూడా మరో మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఈ ఏడాది రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక దిగుబడులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, త్వరలో మరింత మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారి సొంతింటి కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.