13 June, 2026 | 3:20 AM

అలంకారప్రాయంగా ఈ టెండర్ హాల్

13-06-2026 02:05 AM

తఖ్ పట్టి కేంద్రంలో వ్యాపారుల టెండర్లు

కేసముద్రం, జూన్ 12 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈ నామ్ విధానంలో రైతులు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆన్లైన్ ఈ టెండర్ విధానములో కొనుగోలు చేయాల్సిన వ్యాపారులకు ఏర్పాటుచేసిన ఈ  టెండర్ హాల్ అలంకారప్రాయంగా మారింది. దీనితో వ్యాపారులు కేసముద్రం మార్కెట్ యార్డులో ఉన్న కంప్యూటర్ తఖ్ పట్టి కేంద్రంలో టెండర్లు వేస్తున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం ఈనామ్ చాలా ఏళ్లుగా అమలు చేస్తున్నారు.

పూర్తిగా ఆన్లైన్ విధానం, ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మొదలుకొని చెల్లింపుల వరకు పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతోంది. విశిష్టమైన సేవలకు ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా కేసముద్రం మార్కెట్ జాతీయస్థాయిలో ‘ఎక్సలెన్సీ’ అవార్డు కూడా పొందింది. అయితే ఇటీవల వ్యాపారులకు సంబంధించిన ఈ టెండర్ హాల్ ను మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్లలో టోకెన్లు జారీ చేయడానికి ఇచ్చారు.

మొక్కల కొనుగోలు పూర్తి చేసినప్పటికీ, ఈ టెండర్ హాలును తిరిగి వ్యాపారులకు అందుబాటులోకి తేలేదని, దీనితో తాత్కాలికంగా కంప్యూటర్ తఖ్ పట్టి కేంద్రంలో ఉన్న మూడు కంప్యూటర్ల ద్వారా షిఫ్టులవారీగా వ్యాపారులు టెండర్లు వేయాల్సిన పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. కొందరు వ్యాపారులు తమ వ్యాపార కేంద్రాల నుండి టెండర్లు వేస్తుండగా, మరికొందరు మార్కెట్లోనే టెండర్లు వేస్తున్నారు.

కంప్యూటర్ తఖ్ పట్టి కేంద్రంలో క్యాబిన్లు లేకపోవడంతో వ్యాపారులు టెండర్ రేట్లు ఇతరులు కూడా చూసే పరిస్థితి నెలకొంది. దీనితో రహస్య టెండర్లకు అర్థం మారిపోతుందని చెబుతున్నారు. వ్యాపారులు టెండర్ వేస్తున్న సమయంలో అక్కడ ఇతర కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది.

దీనికి తోడు కంప్యూటర్ తఖ్ పట్టి కేంద్రంలో బ్యాటరీలు సరిగా పనిచేయకపోవడంతో, విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినప్పుడు కంప్యూటర్లు పనిచేయడం లేదని, ఫలితంగా బ్యాకప్ లేకపోవడం వల్ల మళ్లీ మొదటినుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సిన పరిస్థితి తరచుగా ఏర్పడుతోందని చెబుతున్నారు. దీనితో వ్యాపారులకు అసౌకర్యంగా మారిందని, వెంటనే ఈ టెండర్ హాలును అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

టెండర్ హాల్ ఓపెన్ చేయిస్తాం

మార్కెట్లో మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్ల సమయంలో రైతులకు టోకెన్లు జారీ చేయడానికి ఈ టెండర్ హాల్ ఇచ్చాము. మొక్కజొన్న కొనుగోళ్ళు ము గిసిపోయిన నేపథ్యంలో తిరిగి టెండర్ హాల్ వ్యాపారులకు ఇచ్చే విధంగా చర్య లు తీసుకుంటాం. త్వరలో టెండర్ హాల్ ఓపెన్ చేయించి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాము. 

రాజేంద్రప్రసాద్, గ్రేడ్ 3 మార్కెట్ కార్యదర్శి, కేసముద్రం