‘మైత్రి డ్రగ్స్’లో కార్మికుడు మృతి!
- పది రోజుల క్రితమే పరిశ్రమలో ప్రమాదం
- గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం
- చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
- బాధితుల ఆందోళనతో దిగివచ్చిన యాజమాన్యం
- రూ.80 లక్షల పరిహారం చెల్లింపునకు అంగీకారం
గుమ్మడిదల, జూన్ 12: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ ల్యాబ్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ కుమార్ (25) అనే యువ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడుస్తున్నా యాజమాన్యం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడటం, కార్మికుడు మృతి చెందిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. పరిశ్రమలోని కెమికల్ ల్యాబొరేట రీలో ప్రవీణ్ కుమార్ విధులు నిర్వహిస్తుండగా రసాయనాలు ప్రాసెస్ చేస్తున్న సమయంలో భద్రతా లోపాలు లేదా సాంకేతిక వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు గానీ, ఫ్యాక్టరీల నియంత్రణ శాఖకు గానీ సమాచారం ఇవ్వలేదు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు గాయపడిన ప్రవీణ్ను గుట్టుచప్పుడు కాకుండా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఐసీయూలో 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయాడు.
పరిశ్రమ ముందు ఆందోళన
కార్మికుడి మరణవార్త తెలియడంతో ఆగ్రహానికి గురై న కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కార్మికులు మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ముందు భారీ ధర్నాకు దిగారు. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడని కార్మిక సం ఘాలు ఆరోపిస్తున్నాయి. గుమ్మడిదల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
80 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం
సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే రాజయ్య పరిశ్రమ ప్రతినిధులతో నిమ్స్ ఆసుపత్రిలో చర్చలు జరిపిం చి మృతుడి కుటుంబానికి రూ.80 లక్షలు, అంతక్రియలకు లక్ష, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, భార్యకు పింఛన్ వసతి కల్పించాలని డిమాండ్ చేయడంతో పరిశ్రమ యాజమాన్యం ఒప్పుకొని ప్రస్తుతం అం తక్రియల ఖర్చు లక్ష రూపాయలు ఇచ్చింది.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య మా ట్లాడుతూ.. పరిశ్రమ యజమాన్యంతో చర్చలు జరిపామని, చర్చల్లో పరిశ్రమ తరఫున ఎన్ శ్రీనివాస్‌రావు, రాంప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారని, కుటుంబ సభ్యు ల సమక్షంలోనే మాట్లాడినట్టు తెలిపారు.






