నీళ్లలోనూ వివక్షేనా..?
- ధనికులకు డైరెక్ట్ ట్యాంకర్లు.. పేదలకు ఖాళీ బిందెలు..?
- వనపర్తిలో నీటి రాజకియం..?
- నీళ్లు కూడా పరిచయాలకేనా..?
వనపర్తి, మే 27 (విజయక్రాంతి): వనపర్తి పట్టణంలో నీటి కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక వైపు ధనికుల ఇళ్ల ముందు ప్రత్యేక వాటర్ ట్యాంకర్లు నిలుస్తుంటే& మరో వైపు పేద ప్రజలు మాత్రం ఒకే ట్యాంక్ చుట్టూ బిందెలతో గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది.
అందరికీ సమాన నీటి సరఫరా అనే నినాదాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని పలు కాలనీల్లో మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వచ్చే సమయం కూడా ఖచ్చితంగా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొందరు రాత్రిళ్లు కూడా మోటార్ల వద్ద కాపలా కాస్తూ నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక ప్రభావశీలుల ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నవారి ఇళ్లకు ప్రత్యేకంగా ట్యాంకర్లు వెళ్లి నీరు సరఫరా చేస్తుండగా& సాధారణ ప్రజలకు మాత్రం నీరు లేదు& మోటార్ పాడైంది& కరెంట్ లేదు అంటూ కారణాలు చెబుతున్నారని మండిపడుతున్నారు.
నీళ్లలోనూ వివక్షేనా..?
పన్నులు మాత్రం అందరి దగ్గర సమానంగా వసూలు చేస్తారు & కానీ నీటి విషయంలో ఎందుకు ఈ తేడా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు నీటి సమస్యలపై స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేసవి తీవ్రత పెరుగుతున్న వేళ తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతుంటే మున్సిపాలిటీ అధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి కాలనీకీ సమానంగా నీటి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వనపర్తిలో నీటి రాజకీయం..?
ఎండాకాలంలో నీటి ఎద్దడి అనేది సర్వ సాధారణం. అలాంటి సమయంలో మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగు నీళ్లను వదులుతు ఇతర అవసరాల నిమిత్తం మున్సిపాలిటీ తరుపున కాలనీ వారీగా నీళ్ల ట్యాంక్ లను పంపుతుంటారు ఆ సమయంలో అవసరం ఉన్న వారు పేద ధనిక అనే తేడా లేకుండా పట్టుకునేది అందరం చూసాం.
కానీ ప్రస్తుతం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం అందుకు విరుద్ధంగా ధనికులు కాస్త ఖద్దరు చొక్కాల పరిచయం ఉన్న వాళ్ల నుండి ఫొన్ చేయిస్తే చాలు నేరుగా వాళ్ల ఇంటికి ఒక ట్యాంకర్ పంపుతూ, ఖద్దరు చొక్కాల పరిచయం లేని వాళ్లు ఆర్థికంగా చితికిన వాళ్లకు మాత్రం అందరికి కలిపి ఒక ట్యాంకర్ పంపుతూ తేడా ను కండ్లకు కట్టినట్లుగా వ్యవహరించడంతో నీళ్ల విషయంలో కూడా పరిచయాలు ఉండాలా అని వనపర్తి లో నీటి రాజకియం నడుస్తుందని మేధావులు, ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అలాంటి అంశాలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రండి
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాలందరు సమానమే అలాంటి వ్యత్యాసాలు ఏమి ఉండవు. ఒక ఇంటికి ఒక వాటర్ ట్యాంకర్, మిగిలిన వాళ్ళందరికి ఒక ట్యాంకర్ అనేది అంటూ ఏమి లేదు ఎక్కడ అవసరం ఉంటే అక్కడి ప్రజలందరి కోసం వాటర్ ట్యాంకర్ పంపుతాం. కాలనీ ప్రజలకు కాకుండా ఒకే ఇంటి దగ్గరికి వాటర్ ట్యాంకర్ వెళ్లినట్లాయితే నేరుగా కాలనీ ప్రజలు తమ దృష్టికి తీసుకుని రండి. కొంతమంది ఇండ్లకు ఒకే వాటర్ ట్యాంకర్ పంపే విషయం తమ దృష్టికి రాలేదు విషయం గురించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుని చర్యలు తీసుకుంటాం
వెంకటేశ్వర్లు, వనపర్తి మున్సిపాలిటీ కమిషనర్
అందరికి సమాన న్యాయం దక్కాలి
ఉన్నోడి ఇంటికి ఒక నీళ్ల ట్యాంకర్, నిరుపేదలందరికి కలిపి ఒక నీళ్ల ట్యాంకర్ ను మున్సిపాలిటీ వాళ్లు పంపించడం దారుణమైన చర్య. అందరికి సమాన న్యాయం దక్కాలి. ఉన్నోడు లేనోడు అనే వ్యత్యాసం లేకుండా మున్సిపాలిటీ ట్యాంకర్ దగ్గర వచ్చి తీసుకుని వెళ్లాలి. ధనికులకు కావాలంటే మున్సిపాలిటీ నుండి నీళ్ల ట్యాంకర్ ను కాకుండా ప్రవేట్ వాటర్ ట్యాంకర్ తెప్పించుకోవాలి.
గోపాల కృష్ణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు






