అకాల వర్షం.. రైతన్నకు కష్టం..
తూప్రాన్, మే 27 : మంగళవారం రాత్రి 9 నుండి నుండి కురిసిన అకాల భారీ వర్షానికి గాను తూప్రాన్ పట్టణ సొసైటీ ఐకెపి సెంటర్ లో, మండల పరిధిలో, మనోహరాబాద్ మండల పరిధిలో రైతులు పండించిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. గత 25 రోజులుగా ఐకెపి సెంటర్ లలో సొసైటీ కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడే ఉండిపోవడం జరిగింది. సరైన సమయానికి లారీలు రాక, సంచులు నింపడానికి హమాలీలు దొరకక వడ్ల ధాన్యం కుప్పలు తేప్పలుగా పడి ఉన్నా యి.
నాలుగు రోజుల నుండి ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన రైతన్న ముప్పేట శాపంగా మారింది. ఎక్కడ చూసి నా వరి ధాన్యం కుప్పలు ఐకెపి సెంటర్లలో ఉండిపోవడంతో పండించిన రైతు ముఖా ల్లో ఆనందం లేకుండా పోయింది. అప్పులు చేసి పంట పండిస్తే చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడం జరుగుతుంది. అధికారులు వాహనాలు లేక, హమాలీలు లేక చేతులెత్తేయడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలయ్యాయి.
తూప్రాన్ మండలం ఘనపూర్‌లో భారీ వర్షానికి కూలిన పెంకుటిల్లు..
తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో ఉన్న పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసమై కూలిపోవడం జరిగింది. దీనికి తోడు గాలి దుమారానికి చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడిపోవడం జరిగింది. దీనితోపాటు విద్యుత్ వైర్లు తెగి పడిపోవడంతో గ్రామస్తులకు రాత్రంతా కరెంటు లేక తీవ్ర ఇబ్బందులతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడపడం జరిగింది.






