ఈడీ దాడులు
- కేరళం మాజీ సీఎం పినరయి నివాసాలపై సోదాలు
- సీపీఎం కార్యకర్తల నిరసన
- ఈడీ అధికారుల కారుపై దాడి, ఉద్రిక్తత
- నా ఇమేజీని దెబ్బతీసే కుట్ర : కేరళం మాజీ సీఎం విజయన్
కేరళం, మే 27(విజయక్రాంతి): కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) కేసులో భాగంగా విజయన్ నివాసాలతో సహా కేరళంలోని పది ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది.
తిరువనంతపురంలో పినరయి నివాసంపై ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ సీపీఎం కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. సోదాల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల కారును అడ్డుకున్నారు. కొందరు రాళ్లతో కారుపై దాడి చేయ డంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టి ఈడీ వాహనాన్ని అక్కడినుంచి పంపించారు.
ఏమిటీ వివాదం?
మాజీ సీఎం విజయన్ కూతురు వీణా విజయన్‌కు చెందిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ నుంచి ఎలాంటి సేవలు పొందకుండానే సీఎంఆర్‌ఎల్ లక్షల రూపాయలు చెల్లించిందని సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఆరోపించిం ది. ఈ నివేదిక ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టింది. మొత్తం రూ.2.7 కోట్లు సీఎంఆర్‌ఎల్ నుంచి ఎక్సాలాజిక్కు అందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఐటీ సర్వీసులు, కన్సల్టెన్సీ సేవల మాటున ఈ చెల్లింపులు సాగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఈడీ కేసును కొట్టేయాలంటూ సీఎంఆర్‌ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళం హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సమయం కావాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) లేకపోయినా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు కొనసాగించవచ్చని ఈడీకి కోర్టు సూచించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ ఇప్పటికే ఈ విషయమై ఫిర్యాదు చేసిందని గుర్తుచేసింది.
ఈ క్రమంలో తిరువనంతపురం, కన్నూరులోని విజయన్ నివాసాలతో పాటు పలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్‌కర్త, మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ (కోజికోడ్) నివాసాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు, ఈ ఆరోపణలను మాజీ సీఎం విజయన్ కొట్టిపారేశారు. తమ ఇమేజీని దెబ్బతీసే లక్ష్యంగా ఈ ఆరోపణలు పుట్టుకొచ్చాయని, దేశంలోని ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కేంద్రం చేస్తున్న దాడుల్లో భాగమే ఇదని పేర్కొన్నారు.
కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది : కేజ్రీవాల్
విజయన్ నివాసాలపై ఈడీ దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడానికి కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ విషయంపై నిలదీసిన తర్వాతే ఈడీ రంగంలోకి దిగడం చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.






