రెవెన్యూలో ఏసీబీ కలకలం!
- రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్‌పేట్ తహసీల్దార్
- కీసర ఆర్‌డీఓ ను విచారిస్తామన్న ఏసీబీ
- రెండేళ్ల క్రితం అప్పటి తహసీల్దార్ సత్యనారాయణ ఇదే తరహాలో..
- రెవెన్యూలో పెరిగిన అవినీతి
మేడ్చల్, మే 27(విజయక్రాంతి): శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రెవెన్యూ శాఖలో కలకలం రేపింది. తహసీల్దార్ ను పట్టుకోవడమే గాక కీసర ఆర్డీవో ను విచారిస్తా మని ఏసీబీ అధికారులు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
అలియాబాద్ శివారులో ల్యాండ్ కన్వర్షన్ కోసం తహసిల్దార్ సుచరిత ఎకరాన లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ ఉంది. ఈ కేసులో మరి కొంతమంది అధికారులకు సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే డ్చల్ జిల్లా హైదరాబాదు నగరంలో కలిసిపోయింది. దీంతో ఇక్కడి భూములకు భారీ ధర పలుకుతుంది. ఇది రెవెన్యూ అధికారులకు కాసుల కురిపిస్తోంది. ప్రతి చిన్న పనికి కూడా లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు.
ఒక్కసారి జిల్లాలో పనిచేసిన రెవెన్యూ అధికారులు కోట్ల ఆస్తులు కూడగడుతున్నారు. గతంలో కూడా షామీర్పేట్ తహసిల్దార్ సత్యనారాయణ రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమి ధరణి పోర్టల్ లో ఎక్కించి, పాస్ బుక్ జారీ చేయడానికి తహసిల్దార్ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించగా 2024 ఫిబ్రవరి 13వ తేదీన తహసిల్దార్ సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బాధితుడు లంచం డబ్బు ఇవ్వబోతుండగా త హసిల్దార్ సత్యనారాయణ డ్రైవర్ కు ఇవ్వమని సూచించాడు. దీంతో డ్రైవర్ ను, తహసిల్దార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లా యు ఎల్ సి ఇన్చార్జి డిప్యూ టీ కలెక్టర్ వంశీ మోహన్‌పై ఆదానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు రాగా 8 చోట్ల సోదాలు చేసి నిర్వహించి భారీ ఆస్తులు గుర్తించారు. ఆ సమయంలో కలెక్టరేట్‌లోని డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.
ఎవరి వాటా ఎంత?
తహసిల్దార్ డిమాండ్ చేసిన లంచం లో ఎవరి వాటా ఎంత అనేది చర్చనీయాంశమైంది. 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్‌కు ఎకరానా రూ.లక్ష చొప్పున డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో ఆర్డీవోను కూడా విచారిస్తామన్నారు. 30 లక్షల లంచంలో ఉన్నతాధికారులకు కూడా వాటా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
తెరపైకి మళ్లీ బొమ్మ రాసిపేట భూములు
షామీర్పేట మండలంలోని బొమ్మరాసిపేట భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బొమ్మరాశపేటలో ఒక మాజీ ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన చెందిన భూములు గతంలో విక్రయించారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హ యాంలో ధరణిలో మళ్లీ వారి పేరే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని బాధితులైన కొనుగోలుదారులు ఆశించారు.
కానీ ప్రస్తుతం మళ్లీ అప్పట్లో విక్రయించిన వారి పేరు మీద పట్టా పాస్ బు క్కులు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే తహసిల్దార్ ఏసీబీకి చిక్కారు. బాధితులు రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో కూడా పెద్ద తలకాయలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏసీబీ దాడులు జరుగుతున్న ఆగని అవినీతి
ఒకవైపు ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ మరోవైపు అధికారుల అవినీతి తగ్గడం లేదు. లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ సోదాలు చేస్తోంది. వారం రోజుల్లో ఒక తహసిల్దార్ ను పట్టుకోవడంతోపాటు, ఇద్దరూ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా అక్రమస్తులను గుర్తించింది. జిల్లాలోని మల్లాపూర్ లో జలమండలి జనరల్ మేనేజ ర్ లక్ష్మీ అనంత కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించి 100 కోట్ల పైన అక్రమ ఆస్తిని ఏసీబీ అధికారులు గుర్తించారు.
అధికారులు డబ్బులు లేనిదే పనిచేయడం లేదు. డబ్బులు ఇస్తే ఏ పని చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేట్ పురం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. తమకు డబ్బులు ఇస్తే చాలు ఏమైనా చేసుకోండని అభయం ఇస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలు జ్వరం అందుకున్నాయి.
వీటిపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు మొహమాటం లేకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 7 నెలల క్రితం ఎల్లంపేటలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అధికారుల అవినీతి అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకురావలసిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
దాడులు చేస్తున్న.. చర్యలు లేవు
ఆర్టీవో కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి విషయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. గతంలో ఉప్పల్, మేడ్చల్ ఆర్టీవో కార్యాలయాల్లో దాడులు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో అవినీతి యథావిధిగా నడుస్తోంది. తాజాగా బుధవారం మేడ్చల్, ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో దాడులు చేశారు. చర్యలు తీసుకుంటే అధికారులు అక్రమాలకు పాల్పడడానికి భయపడతారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






