28 May, 2026 | 1:24 AM

బీఆర్‌ఎస్ సభ్యత్వ జోష్

28-05-2026 12:37 AM
  1. మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ పటిష్టతపై నేతల నజర్
  2. సభ్యత్వ పర్యవేక్షణకు ఇంచార్జీల నియామకం
  3. ప్రతీ నియోజకవర్గంలో 50 వేల నుంచి లక్ష సభ్యత్వాలే లక్ష్యం
  4. డిజిటల్ రూపంలో జరగనున్న సభ్యత్వాలు

మెదక్, మే 28 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్‌లో డిజిటల్ రూపంలో సభ్యత్వ సందడి మొదలైంది. పార్టీనీ క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ శ్రేణులు రంగంలోకి దిగారు. గులాబీ పార్టీలో జిల్లా, మండల, అనుబంధాల కమిటీలను రద్దు చేసింది. మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా, మెదక్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, నర్సాపూర్ నియోజక వర్గానికి నరహరి రెడ్డిలను ఇంచార్జీలుగా నియమించారు.

వీరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు బూత్‌స్థాయి ఇంచార్జీల నియామ క ప్రక్రియ వేగంగా సాగుతోంది. మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో ఉన్న వేలాది బూత్ లకు ఇద్దరేసి కార్యకర్తలను ఇందుకోసం నియమిస్తున్నారు. బూత్‌స్థాయి తర్వాత మండలస్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా జరిగేందుకు ఐదుగురు ముఖ్య నాయకులతో కమిటీ వేస్తున్నారు.  గతంలో కంటే పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు.

ప్రతీ నియోజకవర్గంలో 50 వేల నుంచి లక్ష సభ్యత్వాలే లక్ష్యం... 

మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ నియోజక వర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నర్సాపూర్ నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ప్రతీ నియోజకవర్గంలో 50 వేల నుంచి లక్ష సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ శ్రేణులు పనిచేస్తున్నారు.

గతంలో సభ్యత్వాలు నమోదు చేసేటప్పుడు నియోజక వర్గ ఇంచార్జీ లకు బుక్కులు పంపించి వాటిలో సభ్యత్వం తీసుకునే వారి పేరు, వివరాలు నమోదు చేసేవారు. నమోదు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సమాచారాన్ని కంప్యూటర్ లో నమోదు చేసి కేంద్ర కార్యాలయానికి పంపించే వారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చారు. దీంతో డిజిటల్ రూపంలో సభ్యత్వాల నమోదుకు బిఆర్‌ఎస్ నిర్ణయించింది. కార్యకర్త పేరు, చిరునామా వివరాలు నేరుగా ఆన్ లైన్ లో నమోదు చేసి వారికి రిజిస్ట్రేషన్ నెంబర్ ను కేటాయిస్తారు. 

గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా... 

శిక్షణ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జిలు క్షేత్రస్థాయిలో బూత్కు ఇద్దరు చొప్పున శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. అనంతరం సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ తేదీని ప్రకటిస్తారు. అలా ప్రకటించిన రోజునే పార్టీ అధినేత కేసీఆర్సహా పార్టీ ముఖ్యులందరూ సభ్యత్వ పునరుద్ధరణ నమోదులో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించి, పార్టీలో కొత్త జోష్ నింపేందుకు బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు.

అసంతృప్తి నాయకులే టార్గెట్..

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అసంతృప్తి తో ఉన్న నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా పెట్టుకొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో గ్రామ స్థాయి నుంచి అసంతృప్తి తో ఉన్న నాయకులు, కార్యకర్తల జాబితాను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో గణనీయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని బిఆర్‌ఎస్ శ్రేణులు యోచిస్తున్నారు.