28 May, 2026 | 2:50 AM

సమాచార సాంకేతిక వినియోగం కీలకం

28-05-2026 01:55 AM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ టౌన్, మే 27 :అన్ని రంగాల్లో సమాచార సాంకేతిక వినియోగం కీలకంగా మరిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు బుధవారం తన నివాసంలో డాక్టర్ సుంకరి రాజారామ్, డాక్టర్ చేగోని రవికుమార్ సంయుక్తంగా రచించిన ‘ఐసీటీ అప్లికేషన్స్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ అఫ్ తెలంగాణ ‘ అనే నూతన గ్రంథాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమాచార సాంకేతికత వినియోగం ఎంతో కీలకమని, తెలంగాణలోని అకడమిక్ లైబ్రరీల అభివృద్ధికి ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు.

డిజిటల్ యుగంలో లైబ్రరీలు ఆధునీకరణకు ఇది మార్గదర్శిగా ఉంటుందని పేర్కొన్నారు. రచయితలు డాక్టర్ సుంకరి రాజారామ్ ( ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అటానమస్ నల్గొండ) డాక్టర్ చేగోని రవికుమార్ మాట్లాడుతూ, తెలంగాణలోని అకడమిక్ లైబ్రరీల్లో ఐసీటీ వినియోగం, సవాళ్లు, అవకాశాలను ఈ పుస్తకంలో వివరంగా చర్చించామని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, లైబ్రేరియన్లకు ఇది ఉపయోగపడే సూచనా గ్రంథంగా రూపొందించినట్లు వివరించారు. శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహచార్యులు ఈ పుస్తకాన్ని రచించిన డాక్టర్ సుంకరి రాజారామ్ డాక్టర్ చేగోని రవికుమార్ గార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యారంగ ప్రముఖులు, లైబ్రేరియన్లు, పరిశోధకులు పాల్గొన్నారు.