28 May, 2026 | 2:54 AM

అభివృద్ధి ముసుగులో అవినీతి

28-05-2026 01:55 AM

సీపీఎం ఆరోపణలు

మధిర, మే 27 (విజయక్రాంతి): మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల పేరుతో అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి అవినీతికి పాల్పడుతున్నారని సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. అంబారుపేటలో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ కోసం తక్కువ ధర ఉన్న భూమి విలువను కోట్లకు పెంచే ప్రయత్నం జరుగుతోందని, చెరువులను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. స్మశాన వాటిక పేరుతో మట్టిని కూడా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. మధిరలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. సమావేశంలో శీలం నర్సింహారావు, పడకంటి మురళి, మంద సైదులు పాల్గొన్నారు.