30న కర్ణాటక కొత్త సీఎంగా డీకే!
- నేడు సీఎం సిద్ధరామయ్య నివాసంలో అల్పాహార విందు.. సీఎం పదవికి రాజీనామా?
- క్యాబినెట్‌లోకి సిద్ధు కొడుకు, కేపీసీసీ అధ్యక్షుడిగా అనుచరుడు
బెంగళూరు, మే 27: కర్ణాటక రాజకీయాల్లో పెద్ద మార్పు చోటుచేసుకోబోతోంది. ఈ నెల 30న కర్ణాటక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ప్రస్తు త సీఎం సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించవచ్చని కొన్నివర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.
రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఒత్తిడి రావడమే దీనికి కారణమని సమాచారం. మరోవైపు సిద్ధరామయ్య గురువారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో మంత్రివర్గ సభ్యులందరికీ అల్పాహార విందు ఇవ్వనున్నారు. సిద్ధరామయ్య స్థానంలో ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుంది.
క్యాబినెట్‌లోకి సిద్ధరామయ్య కొడుకు డాక్టర్ యతీంద్రను తీసుకుని, కేపీసీసీ అధ్యక్ష పదవిని సిద్ధు అనుచరుడు సతీష్ జార్కిహోలికి కట్టబెట్టి, సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి అధిష్ఠానం తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు చోటుచేసుకోకుండా ఉండడానికే కాంగ్రెస్ అగ్రనేతలు ఈ నయా ఫార్మూలా తెచ్చినట్లు తెలిసింది. పదవుల పంపకాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో, అటు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా, సామాజిక న్యాయం పాటించేలా హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక ప్రభుత్వంలో, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాజకీయంలో పెనుమార్పులకు వేగంగా అడుగులు పడుతు న్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాకు అంగీకరించి నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య గురువారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌తో అపాయింట్మెంట్ కూడా కోరడం, అల్పాహార విందు ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ధృవీకరిండం చూస్తుంటే రాష్ట్రంలో త్వరలో అధికార మార్పిడి జరగనుందన్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి నేరుగా బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. నాయకుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవని ప్రజల్లోకి సంకేతాలు పంపడానికే ఈ విందును అధిష్ఠానం సిద్ధరామయ్యతో ఏర్పాటు చేయించినట్లు సమాచారం. రాష్ట్రంలో పదవుల పంపకాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక నాయకుల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ పరిణామాలకు బలం చేకూరుస్తూ గురువారం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలవడానికి సిద్ధరామయ్య సమయం కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి. గవర్నర్‌తో జరిగే ఈ సమావేశంలోనే ఆయన రాజీనామా సమర్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా కూడా గురువారం బెంగళూరుకు రానున్నారు. ఆయన పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపి అంతర్గత విభేదాలు రాకుండా చూసే బాధ్యతను తీసుకోనున్నారు. ఒకవేళ నాయకత్వ మార్పు సజావుగా సాగినా పార్టీలోని వివిధ వర్గాల మధ్య పోటీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
క్యాబినెట్‌లోకి సిద్ధరామయ్య కొడుకు, కేపీసీసీగా అనుచరుడు
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను నియమించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పంపకాలకు సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. పార్టీలో తన పట్టును నిలుపుకోవడానికి సిద్ధరామయ్య గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన సన్నిహితుడు సతీష్ జార్కిహోలికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
సిద్ధరామయ్య కుమారుడు, ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న డాక్టర్ యతీంద్రను శివకుమార్ మంత్రివర్గంలోకి తీసుకునేలా ఒప్పందం ఫైనల్ అయినట్లు తలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో సమతుల్యతను కాపాడటానికి అధిష్టానం ఈ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి పంపి, ఆయన అనుచరులకు రాష్ట్రంలో కీలక పదవులు ఇవ్వాలని భావిస్తోంది.
ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్థానంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన, సిద్ధరామయ్య నమ్మకస్తుడైన సతీష్ జార్కిహోలికి ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. దీనివల్ల కులాల సమీకరణ కూడా సరిపోతుందని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం జరిపిన సుదీర్ఘ చర్చల్లోనే ఈ ఫార్ములా ఖరారైనట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ స్వయంగా సిద్ధరామయ్యతో విడిగా సమావేశమై ఈ నిర్ణయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలపై సిద్ధరామయ్య గానీ, డీకే శివకుమార్ గానీ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఎప్పుడూ కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని చెప్పే సిద్ధరామయ్య అంగీకరిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.






