పంట నష్టంపై పరిహారం ఇవ్వాలి
అంతులేని నిర్లక్ష్యం..
- రైతుల పక్షాన బీజేపీ పోరు ఆగదు
- నిరంతరాయంగా రైతు గోస-బీజేపీ భరోసా
- పార్టీ కార్యాలయంలో చేరికల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు చివరి గింజ వరకు కొంటామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవం త్‌రెడ్డి, ఇప్పుడు రైతులను ఎందుకు రోడ్డున పడేశారని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయ ని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేవని, గోదాముల వసతి లేదని, కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని మండిపడ్డారు. రైస్ మిల్లర్ల దగ్గరికి బలవంతంగా పంపిస్తూ హమాలీ పైసలు కూడా రైతుల నుంచే వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తుండటంతో రాత్రికి రాత్రే ధాన్యాన్ని షిఫ్ట్ చేసే డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు.
రైతుల కోసం బీజేపీ చేపట్టిన రైతు గోస--బీజేపీ భరోసా యాత్ర నిరంతరాయంగా కొనసాగుతుందని, గురువారం నిర్మల్‌లో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి విడత యాత్ర ముగుస్తుం దని, కానీ రైతుల పక్షాన బీజేపీ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో బుధవారం పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది.
రాంచందర్ రావుసమక్షంలో హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెంఇన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఐఆర్‌ఎస్ అధికారి సుధాకర్ రెడ్డితోపాలు పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అకాల వర్షాల వల్ల జరిగిన పం ట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన మామిడి , ఇతర పంటల రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. అసెంబ్లీలోనూ బీఆర్‌ఎస్‌కు సున్నానే..
బీజేపీ ఎల్లప్పుడూ దేశం కోసం నిర్మాణాత్మకమైన పంథాలో పనిచేస్తుంటే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వినాశకరమైన ఆలోచనలతో ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌లో సున్నా ప్రాతిని ధ్యం అయిపోయిందని, భవిష్యత్తులో అసెంబ్లీలోనూ వారికి సున్నానే వస్తుందని జోస్యం చెప్పారు. దేశాన్ని, తెలంగాణను కాపాడుకోవడానికి రాష్ట్రంలోని మేధావులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరి, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.
రాబోయే కాలంలోనూ మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ వంటి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలను విమర్శించారే తప్ప దేశాన్ని ఎన్నడూ విమర్శించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తామే శాశ్వతంగా పాలించాలనే అహంకారంతో, ఒక ఓబీసీ సామాజికవర్గానికి చెందిన సామాన్యుడు ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఈ రోజు కేవలం మోదీకో, బీజేపీకో వ్యతిరేకం కాదని, ఏకంగా భారతదేశానికే వ్యతిరేకంగా మారిపోయిందని మండిపడ్డారు.
అబద్ధపు ప్రచారాలు..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటివరకు దాదాపు రూ.13 లక్షల కోట్ల నిధులను, ప్రాజెక్టులను కేటాయించిందని తెలిపారు. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కోట్లాది రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న పూర్తి వరి ధాన్యం కొనుగోళ్ల నిధులను కేంద్రమే రీయింబర్స్ చేస్తోందని తెలిపారు. ఇంత జరుగుతున్నా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కళ్లకు గంతలు కట్టుకుని కేంద్రం ఏమీ ఇవ్వలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని, వారు రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికిరణ్, హుజూర్ నగర్ బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీలత, తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రమాబాయి అంబేద్కర్ 91వ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. .
రాష్ట్రంలో కమీషన్ల పాలన
బాన్సువాడ, మే 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ గత పదేళ్ల పాలనలో దాచుకో దోచుకో పాలన సాగించిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకెంత నాకెంత అంటూ మంత్రులు కబీషన్ల పాలన సాగిస్తూ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ కార్యక ర్తలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. బుధవారం ముగిం పు కార్యక్రమానికి హాజరై, మాట్లాడారు.
బీఆర్‌ఎస్ హయాంలో బీఆర్‌ఎస్ నాయకులు 30% కమీషన్ తీసుకుంటే, కాంగ్రె స్ ప్రభుత్వంలో 40% కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం మాత్రం బాగుపడ్డదని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, నువ్వెంత నేనెంత, నాకెంత నీకెంత అని పంచుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు.






