6 June, 2026 | 12:00 PM

జన్నారం అడవుల్లో నీటి ఎద్దడి

06-06-2026 10:13 AM

నీటి కోసం వచ్చిన అడవి బర్రె

జన్నారం, (విజయక్రాంతి): ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. అడవుల్లో సహజ సిద్ధమైన నీటి వనరులు ఎండిపోతుండటంతో, కవ్వాల్ అభయారణ్యంలోని వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి అటవీ సమీప ప్రాంతాల్లోని నీటి కుంటల వైపు అడుగులు వేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి శివారు అటవీ ప్రాంతంలో శుక్ర వారం సాయంత్రం ఒక భారీ అడవి బర్రె (బోడిగె/గౌర్) నీటిని వెతుక్కుంటూ అటవీ శివారు ప్రాంతానికి వచ్చింది.

అక్కడ ఉన్న ఒక చిన్న నీటి కుంట వద్దకు చేరుకుని నీరు తాగి తన దాహాన్ని తీర్చుకుంది. అడవి బర్రె నీటి కుంట వద్ద నీరు తాగుతుండగా ఆ మార్గంలో వెళ్లిన స్థానికులు తమ మొబైల్ లో చిత్రీకరించారు. నీరు తాగిన అనంతరం ఆ వన్యప్రాణి మళ్లీ దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఎండల తీవ్రత కారణంగా అడవి లోపల నీటి సమస్య ఏర్పడటం వల్లనే వన్యప్రాణులు అడవులను వదులుతున్నాయని, వన్యమృగాలు జనావాసాలకు, అటవీ సరిహద్దులకు దగ్గరగా వస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి అటవీ శాఖ అధికారులు అడవుల లోపల సాసర్‌ పిట్లు (కృత్రిమ నీటి తొట్టెలు) ఏర్పాటు చేసి, వాటిలో నిరంతరం నీటిని నింపాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.