మినరల్స్ పేరుతో నీళ్ల దందా!
- అనుమతులు లేకుండానే అడ్డగోలు ప్లాంట్లు
- అరకొర మిషన్ భగీరథ నీటి సరఫరా
- గ్రామాల్లోకీ విస్తరించిన వాటర్ ప్లాంట్ల దందా
- నాణ్యత పరీక్షలు, లైసెన్సులు, ప్రమాణాలు గాలికి..
- ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
- పట్టించుకోని అధికారులు
నాగర్‌కర్నూల్ జూలై 28 (విజయక్రాంతి): సామాన్య జనం కనీస అవసరం సాగునీరు. అది పూర్తిస్థాయిలో ప్రభుత్వం, యంత్రాంగం ప్రజలకు అందించక పోవడంతో ప్రజలు మినరల్స్ వాటర్ వైపు చూస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వాటర్ ప్లాంట్ యాజమాన్యాలు ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలు గాలికొదిలేసి ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో అడ్డగోలు ధరలు నిర్ణయిస్తూ నీటి దందాకు పాల్పడుతున్నారు.
మినరల్స్ వాటర్ యాజమాన్యాలు సిండికేట్ గా మారి అడ్డగోలుగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాలు కనీస తాగునీటి అవసరం తీరుస్తామంటూ గొప్పగా ప్రగల్బాలు పలికే ప్రభుత్వ యంత్రాంగం మిషన్ భగీరథ నీటిని కూడా పూర్తిస్థాయిలో అందించలేక పోతోందని సామాన్యులు మండిపడుతున్నారు. ఫలితంగానే జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు మారుమూల పల్లెల్లోనూ మినరల్స్ వాటర్ వ్యాపారం విస్తరిస్తోంది.
నిత్యం బాటిల్ ద్వారా చిన్నపాటి ఆటోల్లో ప్లాస్టిక్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ శుభ్రత బాధ్యతను కూడా మరిచిపోతున్నారు. ఏళ్ల తరబడి ప్లాస్టిక్ బాటిళ్లు శుభ్రం చేయకుండానే సామాన్యులకు ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో కెమికల్ నీటిని పంపిణీ చేస్తుండడంతో నాచు, క్రిమి కీటకాలు వంటి వాటితో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. జిల్లాలోని నాగర్ కర్నూల్ 32 , అచ్చంపేట 38, కల్వకుర్తి 42, కొల్లాపూర్ పరిధిలో 50కి పైగా ఇలా పట్టణాలతో పాటు సమీప గ్రామాల్లోనూ 162 మినరల్ వాటర్ ప్లాంట్స్ అనధికారికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతి నీటి ప్లాంటు ఆర్వో, యువి, నీటి శుద్ధి ప్రమాణాలు పాటిస్తూనే, బూరొవ్ అఫ్ ఇండియన్ స్టాండరడ్స్ లైసెన్స్ తప్పనిసరి పొండాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండరడ్స్ అథారిటీ అఫ్ ఇండియా లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటివి తప్పనిసరి పొందాలి. కానీ జిల్లాలో ఎక్కడ కూడా లైసెన్స్ పొందిన వాటర్ ప్లాంట్ ఉన్నట్లు అధికారిక లెక్కలు లేకపోవడం విశేషం. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
కల్తీ నీటితో కిడ్నీ సమస్యలు..
ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే కల్తీ చేసిన నీటిని ప్రజలకు చేరవేయడంతో ఆ నీటిని తాగిన ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధి దారిన పడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయనే ఆందోళన ప్రజల్లో ఉన్న నేపథ్యంలో తాగునీటి నాణ్యతపై సమగ్ర పరిశీలన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆరోగ్య శాఖ, ఆహార భద్రత శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, సంబంధిత మున్సిపాలిటీ విభాగాలు శాస్త్రీయంగా నీటి నమూనాలు సేకరించి ప్రజా రోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమతులు లేని ప్లాంట్లను గుర్తించడం, నీటి నాణ్యత పరీక్షించడం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలి.
వావిలాల రాజశేఖర్ శర్మ, సామాజిక ఉద్యమకారుడు.
తాగునీటి అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం..
మినరల్స్ వాటర్ తాగునీరు అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ లు ప్యూరిఫైడ్ వాటర్ కేంద్రాల నిర్వాహకులతో సమావేశపరిచి నిబంధనలు పాటించాలని సూచిస్తాం. అయినా పట్టించుకోని వారిపై కఠిన చర్యలు చేపడతాం. మిషన్ భగీరథ తాగునీటిని సైతం పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు చర్యలు తీసుకుంటం.
నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్.






