29 July, 2026 | 2:34 AM

పీవోకే ఎన్నికల్లో హింస

29-07-2026 01:40 AM
  1. ఉద్యమకారులపై పాక్ సైన్యం కాల్పులు
  2. 20మంది మృతి.. 50 మందికి గాయాలు

న్యూఢిల్లీ, జూలై 28: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల్లో   హింస చెలరేగింది. పాక్ దళాల కాల్పుల్లో 20 మందికి పైగా ఉద్యమకారులు మృతి చెందగా, 50మందికి పైగా గాయాలయ్యాయని జాయిం ట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆరోపించింది. రావల్‌కోట్ డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉద్యమకారులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారని ఆరోపించింది. ఈ కాల్పుల్లో జేఏఏసీ ప్రతినిధి ఉమర్ నజీర్ కశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతి చెందినట్లు పేర్కొన్నారు. జూన్ 5 నుంచి పీవోకేలో ఎన్నికలకు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభం కాగా, పాక్ బలగాల కాల్పుల్లో 80మంది మృతి చెందారు. 

పీవోకేలో 53 స్థానాలకు 45 స్థానాల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశ జూలై 27న జరగగా, ఆగస్ట్ 2న రెండో దశ, ఆగస్ట్ 10న మూడోదశ ఎన్నికలను పాక్ ప్రభుత్వం నిర్వహించనుంది. కాగా పాక్ నిర్వహిస్తున్న ఈ ఎన్నికలను గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. పీవోకే ఆక్రమణ, మానవహక్కుల ఉల్లంఘనల నుంచి దృష్టి మళ్లించేందుకు పాక్ ఈ ఎన్నికలను వాడుకుంటోందని భారత్ విదేశాంగ శాఖ ప్రకటించింది.