అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా
- 39మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
- ఇంటిపై పడ్డడడంతో తప్పిన పెనుప్రమాదం
శ్రీనగర్, జూలై 28: జమ్మూకశ్మీర్ బాల్టాల్ నుంచి శ్రీనగర్ వెళుతున్న మంద్‌సౌర్ అమర్‌నాథ్ యాత్రికుల బస్సు అదుపు తప్పి.. 50 అడుగుల కింద ఓ ఇంటిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 39 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం గందర్‌బాల్ జిల్లా కంగన్ ప్రాంతానికి సమీపంలో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది.
మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి ఓ ఇంటిపై పడిందని అధికారులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. అంతేకాదు ఈ బస్సు సింధునదిలోయలో బస్సు పడిపోకుండా ఈ ఇల్లు అడ్డుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. గాయపడిన యాత్రికులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదానికి గురైన బస్సు మంద్‌సౌర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ట్రావెల్‌కు చెంది. అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి నాలుగు బస్సులు బయలుదేరగా ఈ బస్సుకు ప్రమాదం వాటిల్లిందన్నారు. గాయపడిన వారిలో అత్యధికులు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి పరిస్థితులపై ఆరా తీశారు. జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి వారి ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.






