ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన వ్యక్తి
- కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
- ఎలా నియమించారని ప్రధాని మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ, జూలై 28: నూతనంగా నియమితులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ‘అత్యంత నీచమైన వ్యక్తి’ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిందితులను సమర్థించే వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం ఆశ్చర్యకరమన్నారు. మంగళవారం పార్లమెంట్ బయట ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించిన నిర్ణయాన్ని ప్రశ్నించారు.
ప్రహ్లాద్ జోషి బిల్కిస్ బానో కేసులో అత్యాచార నిందితులను సమర్థించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి కేంద్రం విద్యాశాఖమంత్రిగా ఎలా బాధ్యతలను అప్పగించిందని ప్రశ్నించారు. ‘దేశంలో యువత విద్యా వ్యవస్థపై నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఎంతో మంది విద్యార్థినులు ఆందోళనల్లో పాల్గొన్నారు. వారిపై దాడులు జరిగాయి. అలాంటి సమయంలో అత్యాచార నిందితులను సమర్థించే వ్యక్తిని బీజేపీ విద్యాశాఖ మంత్రిగా నియమించింది.
అలాంటి వ్యక్తి కంటే నీచమైన వ్యక్తి మరొకరు ఉండరు. అత్యాచార నిందితులకు రక్షణ కల్పించాలనే వ్యక్తే ఇప్పుడు భారత విద్యాశాఖ మంత్రి’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా ప్రధాని మోదీ నిర్ణయంపై కూడా విమర్శలు చేశారు. ‘ప్రధాని స్పందన చాలా విచిత్రంగా ఉంది. ఆయన మంత్రివర్గంలో ఎంతో మంది మంత్రులు ఉన్నారు. వారిలో ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు. కానీ అత్యాచార నిందితులను రక్షించే వ్యక్తినే ఎంపిక చేశారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం’ అని అన్నారు. కాగా లోక్‌సభలోనూ జోషిపై ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఇవే ఆరోపణలు చేశారు.






