21 April, 2026 | 4:31 AM

వింటేజ్ కేసీఆర్

21-04-2026 02:46 AM
  1. కేసీఆర్ సభ సూపర్ హిట్
  2. ప్రసంగంలో మళ్లీ పాత కేసీఆర్
  3. బీఆర్‌ఎస్ క్యాడర్‌లో ఫుల్ జోష్

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): జగిత్యాల వేదికగా నిర్వహించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. కేసీఆర్ ప్రసంగంతో మళ్లీ పాత కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చారు. ‘చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడతది.. గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట పెద్ద సైన్యమై నడుస్తుంది’ అని ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ కవితను గుర్తు చేసుకుంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. జగిత్యాల సభలో మళ్లీ పాత కేసీఆర్ కనిపించేలా మాట్లాడారు. గతంలో వరంగల్‌లో నిర్వహించిన సభలో ఆశించిన స్థాయిలో కేసీఆర్ ప్రసంగించలేదు. దీంతో అప్పుడు బీఆర్‌ఎస్ శ్రేణులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. కానీ ఈసారి జగిత్యాల సభలో మాత్రం కేసీఆర్ పూర్తిగా రీచార్జ్ అయినట్టు కనిపించారు. సభా ప్రాంగణం మొత్తం గులాబీ జెండాలతో కిక్కిరిసిపోగా, కేసీఆర్ వేదికపైకి రాగానే ఈలలు, కేరింతలు, నినాదాలతో ఊగిపోయింది.

కేసీఆర్ ప్రసంగం అంతా ఆయన ఆగ్రహం, వ్యంగ్యం, భావోద్వేగం కలగలిపిన శైలిలో సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేస్తూ, అప్పటి పరిస్థితులను వివరిస్తూ క్యాడర్‌లో పాత జోష్‌ను మళ్లీ రగిలించారు. జగిత్యాల యుద్ధం మీది.. తెలంగాణ యుద్ధం మాది అంటూ కేసీఆర్ ఇచ్చిన నినాదం సభలో హైలైట్‌గా నిలిచింది. సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నేను జీవన్‌రెడ్డి కుటుంబంలో అన్నదమ్ముళ్ల లాగా పనిచేస్తం. తెలంగాణలో భయంకర పరిస్థితులు వచ్చాయి.

రాష్ట్రమంతా ఆగమాగం అడవిఅడవి అయింది. ఆనాడు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తెలంగాణ అనే మాట కూడా అననియ్యలే. అందుకే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ముందుకు సాగినం. తెలంగాణను సాధించి పదేళ్లు మంచిగ చేస్తే ఇప్పుడు వట్టి గప్పాలు కొట్టుడు తప్ప చేసిందేమీ లేదు. అడ్డం పొడుగు మాట్లాడేటోళ్లను లాగులు పలిగే దాకా కొట్టాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతు బంధుకు రాంరాం.. దళిత బంధుకు జై భీం.

దమ్ముంటే యూరియా బస్తాలు షాపుల్లో పెట్టాలి.. యాప్‌లని పెడితే.. కాళ్లకు వాపు వస్తుంది. ఇప్పుడు నెలకొక ఎకరం రైతు బంధు ఇస్తున్నారు.. కేసీఆర్ జగిత్యాలలో సభ అనంగనే రైతుబంధు వేసిన్రు. ఈ కాంగ్రెస్ సిపాయిలు ఆరు చందమామలు.. ఏడు సూర్యులు పెడతామని నరికిండ్రు కదా ఏం చేసిన్రు. వడ్లకు వట్టిడే బోనస్ అంతా బోగస్. కాకి కంకెడు.. పిట్టకు పిడికెడు లేదు ప్రజలకేం ఇస్తరు. రాష్ట్రంలో పరిస్థితి ఆగంగా ఉంది.

అందుకే కాంగ్రెస్ పోవాలె.. బీఆర్‌ఎస్ రావాలె. హైదరాబాద్‌లో హైడ్రా అని పెట్టి పేదోళ్ల ఇళ్లు కూలుస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడొకాయన నిజామాబాద్‌లో నిడ్రా అని పెడతారంటా. జగిత్యాలలో జిడ్రా అని పెడతారా. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవుతల పడేస్తా. మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే పెడతా. మూసీ పునరుద్ధరణ అంటున్నారు.. అది అయ్యేది కాదు.. పీకేది కాదు.

మూసీ అభివృద్ధికి వేలాది మంది పేదల ఇళ్లు కూల్చాలా? తెలంగాణ దరిద్రం పోయే దాకా సేవ చేస్తూనే ఉంటా’ అని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రతి వ్యాఖ్యకు క్యాడర్ నుంచి ఊహించని స్థాయిలో స్పందన రావడం సభలో స్పష్టంగా కనిపించింది. మధ్య మధ్యలో నినాదాలు, ఈలలు, కేరింతలతో సభాస్థలి మార్మోగింది. నాయకుడు క్యాడర్ మధ్య భావోద్వేగ అనుబంధం మళ్లీ బలపడిందనే సంకేతాలు ఈ సభ ఇచ్చింది.