30 July, 2026 | 1:14 AM

గ్రామాభివృద్ధిని వేగవంతం చేయాలి

30-07-2026 12:21 AM

హుస్నాబాద్, జూలై 29: గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం పయనిస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల అభివృద్ధి సమీక్షా సమావేశానికి హాజరై మాట్లాడారు. తాగునీటి సరఫరా, ఎల్ నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, విద్యుత్, విద్య, ఉపాధి హామీ తదితర అంశాలపై అధికారులతో ప్రజాప్రతినితో చర్చించారు.

గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులకు ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీఛార్జ్ పిట్స్ నిర్మాణం చేపట్టి జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.