మోడల్ కాలనీగా వెలుగుమట్ల
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- భూదాన్ భూముల్లో 38 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఖమ్మం, మార్చి 12 (విజయక్రాంతి)/కూసుమంచి: రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా వెలుగు మట్లను తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం వెలుగుమట్ల భూదాన్ భూములలో 38 ఇండ్ల నిర్మా ణ పనులకు ఖమ్మం సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరికం ఆసరా చేసుకొని ధనార్జన కోసం దళారులను అడ్డుపెట్టి ఇతర జిల్లా, రాష్ట్రాల వారిని రెచ్చగొట్టి ఫేక్ డాక్యుమెంట్‌లతో భూమి పేదలకు మోసపూరితంగా అప్పగించారని ఆరోపించారు. 1953లో ఓ ఆసామి 31 ఎకరాల 7 గుంటల భూమి దానం చేశారని తెలిపారు. గత 8 సంవత్సరాల కాలంలో అనేక సమస్యలు పేదలు ఎదుర్కొన్నారని, త్రాగునీటి, విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు కల్పన లేకుండా బాధలు పడ్డారని తెలిపారు.
కరెంట్, మంచి నీరు ప్రతి అంశానికి డబ్బులు డిమాండ్ చేస్తూ మాఫియా నడిపించారని మంత్రి తెలిపారు. పేదలను దిన దిన గండం నుంచి కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని అన్నారు. భూదాన్ భూములు ఆక్రమించుకోవాలని సిసిఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూల్చివేతలు జరిగాయని అన్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 నాటికి కాలనీ పూర్తి చేస్తామని తెలిపారు.
పేదలకు పంచిన తర్వాత మిగిలిన భూమిలో స్కూల్, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. వెలుగుమట్ల లేఔట్ లో కరెంటు పోల్స్, విద్యుత్ సరఫరా పనులు యుద్ధ ప్రాతిపదికన ఉగాది లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పైప్ లైన్ పనులు చేపట్టాలన్నారు.
దళారులకు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారు వివరాలు పోలీసు అధికారులకు అందించాలని అన్నారు. ప్రజలను మోసం చేసిన ఎవరిని విడిచి పెట్టే సమస్య లేదని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, హౌజింగ్ పిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.




